
యోగాంధ్రలో ప్రజలు భాగస్వాములు కావాలి
కర్నూలు(అర్బన్): యోగాంధ్రలో ప్రజలు భాగస్వాములై అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య కోరారు. శుక్రవారం జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుంచి రాజ్‌విహార్ సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రాముఖ్యతను ప్రజలందరూ తెలుసుకోవాలన్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో యోగా పోటీలను నిర్వహించి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బహుమతులు అందిస్తామన్నారు. ప్రతి రోజు యోగాపై అవగాహన కల్పించేందుకు ర్యాలీలు, మానవహారాలు, ఏదో ఒక రకమైన ఈవెంట్లను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షులు కరణం కిశోర్‌కుమార్, డీఎస్‌ఓ రాజారఘువీర్, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, డీఎస్‌డీఓ భూపతిరావు, డీఏఓ డాక్టర్ శ్రీనివాసులు, ఆయుష్ శాఖ డాక్టర్ కేవీఎన్ ప్రసాద్, రాష్ట్ర యోగా సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్‌శెట్టి తదితరులు పాల్గొన్నారు.
27లోగా బదిలీల దరఖాస్తులు జెడ్పీకి పంపాలి
కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ పరిధిలోని ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన దరఖాస్తులను ఈ నెల 27లోగా జిల్లా పరిషత్‌కు పంపాలని జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలకు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఒకేచోట 5 సంవత్సరాల సర్వీసు పూర్తయిన ఉద్యోగుల బదిలీలను చేపడుతున్నట్లు ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను కూడా ఆయా కార్యాలయాల అధిపతులకు పంపించామన్నారు. 27వ తేదీ తరువాత వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోబోమన్నారు.
కోడుమూరుకు చేరిన జీడీపీ నీరు
కోడుమూరు రూరల్: పట్టణ ప్రజల దాహార్తి తీర్చేందుకు గాజులదిన్నె ప్రాజెక్టు నీరు శుక్రవారం కోడుమూరు వద్ద హంద్రీకి చేరుకున్నాయి. హంద్రీ పరీవాహక ప్రాంతాల్లో నెలకొన్న నీటి సమస్య పరిష్కారానికి జీడీపీ ఎడమ కాల్వ ద్వారా 40క్యూసెక్కుల చొప్పున వర్కూరు సుద్ధవాగు మీదుగా గత మూడు రోజుల నుంచి కోడుమూరు హంద్రీనదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. మరో నాలుగైదు రోజులు నీరు వదిలితే పూర్తిస్థాయిలో మంచినీటి పథకాలకు చేరుకుంటాయని కోడుమూరు ఆర్‌డబ్ల్యుఎస్ ఏఈ ప్రసాద్ తెలిపారు.
సీహెచ్‌ఓల వినూత్న నిరసన
● ధర్నా చౌక్‌లో యోగా, రక్తదానం
కర్నూలు(హాస్పిటల్): వైద్య ఆరోగ్యశాఖలోని విలేజ్ హెల్త్ క్లినిక్‌లలో పనిచేసే సీహెచ్‌వోల(ఎంఎల్‌హెచ్‌పీ) ఆందోళన 26వ రోజుకు చేరుకుంది. కర్నూలులోని శ్రీకృష్ణదేవరాయల సర్కిల్ వద్దనున్న ధర్నా చౌక్‌లో శుక్రవారం యోగాసనాలు, రక్తదాన కార్యక్రమాలతో వినూత్నంగా నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఏపీఎంసీఏ జిల్లా ప్రెసిడెంట్ చందన మాట్లాడుతూ డిమాండ్ల పరిష్కారానికి తాము 26 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం, అధికారుల నుంచి ఎలాంటి స్పందన రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ఒక్క రూ తమను చర్చలకు పిలవడం లేదన్నారు. తమ డిమాండ్‌లు నెరవేర్చేంత వరకు శాంతియుతంగా ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. నిరసనలో అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగేంద్రప్రసాద్, ఉపాధ్యక్షులు నాగరాజు, ట్రెజరర్ కార్తీక్ పాల్గొన్నారు.

యోగాంధ్రలో ప్రజలు భాగస్వాములు కావాలి

యోగాంధ్రలో ప్రజలు భాగస్వాములు కావాలి