ప్రచారం లేకుండానే ఫ్యాక్టరీపై ప్రజాభిప్రాయ సేకరణ తగదు
కర్నూలు(టౌన్): టీజీవీ కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించి బై ప్రోడక్ట్ పేరుతో ఏర్పాటు చేయనున్న ఫ్యాక్టరీపై ముందుగా పరిసర ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు అవగాహన కల్పించకుండా, ప్రచారం లేకుండా ప్రజాభిప్రాయం చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. మంగళవారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్‌లో ఎస్వీ మోహన్ రెడ్డిని ప్రజా సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ రామక్రిష్ణ రెడ్డితో పాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు కలిశారు. కెమికల్ ఫ్యాక్టరీ యజమాన్యం ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాలని ఈసందర్భంగా కోరారు. బైప్రోడక్ట్ వల్ల ప్రజలకు, రైతులకు తాగునీరు, సాగునీరు సమస్యలు వస్తాయని సూచించారు. ఈ సందర్భంగా ఎస్వీ మాట్లాడుతూ అధికారం ఉంది కదా అని ప్రజలకు ప్రమాదకరంగా ఉన్నా.. అనుమతులు యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారన్నారు. పరిసర ప్రాంత ప్రజలకు ఫ్యాక్టరీలో ఏర్పాటు చేయనున్న ప్రోడక్ట్ గురించి వివరించాలన్నారు. ఎస్వీని కలిసిన వారిలో సీఐటీయూ కన్వీనర్ రాధక్రిష్ణ, రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, రాయలసీమ విద్యావంతుల వేదిక కో కన్వీనర్ భాస్కర్ రెడ్డి, ఉపాధ్యాయ సమాఖ్య నాయకులు రత్నం ఏసేపు, కెపీఎన్‌ఎస్ నాయకులు ఆనంద్‌బాబు, ఎస్‌డీపిఐ నాయకులు జహంగీర్, సుంకన్న ఉన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి


