సబ్సిడీ తగ్గి.. ధర పెరిగి!
నాణ్యత ప్రశ్నార్థకమే!
ఉమ్మడి జిల్లాకు అవసరమైన వేరుశనగను ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ(ఏపీసీడ్స్) సరఫరా చేస్తోంది. వేరుశనగ విత్తనోత్పత్తి లేకపోవడంతో దళారులే ఆధార మయ్యారు. గత ఏడాది పంపిణీ చేసిన వేరుశనగ నాణ్యతపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. విత్తనం కాయల ప్యాకెట్లలో రాళ్లు, మట్టి పెళ్లలు, చెత్త చెదారం ఉండటం, విత్తనం నాసిరకంగా ఉండటం పట్ల రైతులు ఆందోళనకు గురయ్యారు. వేరుశనగ నాణ్యత బాగాలేదని వ్యవసాయ అధికారులు కూడా వెనక్కి పంపించారు. ఈ సారైన వేరుశనగ విత్తనం కాయల్లో నాణ్యత ఉంటుందా అదే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. వేరుశనగ కోసం దళారులపై ఆధారపడుతుండటంతోనాణ్యత కొండెక్కుతోందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్‌కు కూటమి ప్రభుత్వం ఆరకొరగా వేరుశనగ విత్తనాలు కేటాయించింది. వీటికి బహిరంగ మార్కెట్ కంటే ఎక్కువగా ధర ఉండటం తీవ్ర విమర్శలకు దారి తీసింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఐదేళ్లు ఖరీఫ్‌లో వేరుశనగ విత్తనం కాయలను 35 శాతం సబ్సిడీపై పంపిణీ చేసింది. కూటమి ప్రభుత్వం మాత్రం 25 శాతం సబ్సిడీతో పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 80 వేల హెక్టార్లలో వేరుశనగ పంటశ సాగు చేస్తారు. మొత్తం 32,181 క్వింటాళ్ల విత్తనం కాయలు అవసరమని మండల వ్యవసాయ అధికారులు, ఏడీఏలు నివేదించారు. కానీ ప్రభుత్వం ఉమ్మడి జిల్లాకు అంతంత మాత్రంగా 11,108 క్వింటాళ్లు మాత్రమే కేటాయించింది. వేరుశనగ పూర్తి ధర నిర్ణయించినప్పటికీ సబ్సిడీ ప్రకటించలేదు. గత ఏడాది 25 శాతం మాత్రమే సబ్సిడీ ఇచ్చింది. ఈ సారి కూడా 25 శాతం వరకే సబ్సిడీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. కర్నూలు జిల్లాలో ఆలూరు, పత్తికొండ, ఎమ్మగనూరు, చిప్పగిరి, దేవనకొండ, హాలహర్వి, పెద్దకడుబూరు, కల్లూరు, కృష్ణగిరి, వెల్దుర్తి, కర్నూలు, ఓర్వకల్లు, ఆదోని, కొసిగి, ఎమ్మిగనూరు, గోనెగండ్ల, నంద్యాల జిల్లాలో డోన్, ప్యాపిలి, బేతంచెర్ల, నందికొట్కూరు మండలాల్లో సాగు చేస్తారు.
కేటాయింపులు నామమాత్రం
గత ఏడాది ఖరీఫ్‌లో కర్నూలు జిల్లాలో 13,804, నంద్యాల జిల్లాలో 3,063 క్వింటాళ్ల వేరుశనగ విత్తనం కాయలు పంపిణీ అయ్యాయి. ప్రస్తుతం కర్నూలు జిల్లాకు 9,099, నంద్యాల జిల్లాకు 2,009 క్వింటాళ్ల ప్రకారం కేటాయించింది. వేరుశనగ సాగు కర్నూలు జిల్లాలో 55 వేల హెక్టార్లు, నంద్యాల జిల్లాలో 30 వేల హెక్టార్ల వరకు సాగవుతంది. కర్నూలు జిల్లాకు 18,310, నంద్యాల జిల్లాకు 14,181 ప్రకారం 32,491 క్వింటాళ్లు అవసరమని జిల్లా వ్యవసాయ యంత్రాంగం నివేదించింది. ఈ ప్రకారం కేటాయించకపోయినా.. గత ఏడాది మేరకు కేటాయించాలి. కాని తూతూ మంత్రంగా కేటాయించడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. మార్కెట్‌లో వేరుశనగ క్వింటాకు రూ.6,500 వరకు ధర ఉంది. ప్రభుత్వం మాత్రం రైతులకు పంపిణీ చేసే వేరుశనగ ధర రూ.9,300గా నిర్ణయించింది. దళారులకు మేలు చేసే విధంగా ధర నిర్ణయించిందనే విమర్శలు ఉన్నాయి.
కేటాయింపులు ఇలా...
కర్నూలు జిల్లాకు 9,099 క్వింటాళ్లు కేటయించగా.. సాగు విస్తీర్ణాన్ని బట్టి సబ్ డివిజన్‌లు, మండలాలకు జిల్లా వ్యవసాయ కేటాయించింది. కర్నూలు సబ్ డివిజన్‌కు 495, ఆదోని సబ్‌డివిజన్‌కు 1,182, ఎమ్మిగనూరు సబ్‌డివిజన్‌కు 320, ఆలూరు సబ్ డివిజన్‌కు 1017, పత్తికొండ సబ్ డివిజన్‌కు 6,085 క్వింటాళ్లు ప్రకారం కేటాయించారు. నంద్యాల జిల్లాకు కేటాయించిన 2,009 క్వింటాళ్ల విత్తనాలను ప్యాపిలి, డోన్, బేతంచెర్ల, నందికొట్కూరు, కోవెలకుంట్ల తదితర మండలాలకు కేటయించారు.
వేరుశనగ రైతును ఆదుకోని
రాష్ట్ర ప్రభుత్వం
ఉమ్మడి జిల్లాకు
అవసరం 32,471 క్వింటాళ్లు
కేటాయింపు 11,108 క్వింటాళ్లు
మాత్రమే
మార్కెట్‌లో ధర రూ.6,500 అయితే..
ప్రభుత్వం ధర రూ.9,300


