
పీఠాధిపతికి తులాభారం
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు తులాభారం వేడుక కనుల పండువగా సాగింది. బుధవారం కర్ణాకటలోని మాండ్యకు చెందిన మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ దంపతులు మొక్కుబడిలో భాగంగా బియ్యం, బేడలు, బాదంతో తులాభారం చేపట్టారు. శ్రీమఠం ప్రాంగణంలోని తులాభారం కౌంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
జెడ్పీలో అల్లూరికి
ఘన నివాళి
కర్నూలు(అర్బన్): మన్యం వీరుడు అల్లూరి సీతారామారాజు నిబద్ధత, త్యాగం ఉంటే ఎలాంటి అణచివేతనైనా ఎదర్కోగలమని జిల్లా పరిషత్ సీఈఓ జి. నాసరరెడ్డి అన్నారు. బుధవారం అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా స్థానిక జెడ్పీలోని మినీ సమావేశ భవనంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు అతి చిన్న వయస్సులోనే వీర మరణం పొందారన్నారు. భారత స్వాతంత్ర చరిత్రలో అల్లూరి బ్రిటీష్ వారికి కంటి మీద కునుకు లేకుండా చేశారన్నారు. సమాజం కోసం ప్రాణాలను అర్పించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతను అలవరచుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎల్‌డీఓ అనురాధ, జెడ్పీలోని వివిధ విభాగాలకు చెందిన పరిపాలనాధికారులు సి. మురళీమోహన్‌రెడ్డి, రాంగోపాల్, జితేంద్ర, సరస్వతమ్మ, పుల్లయ్య, బసవశేఖర్‌తో పాటు ఉద్యోగులు పాల్గొన్నారు.
బైక్ దొంగను పట్టుకుంటే..
బంగారు నగలు లభ్యం
సి.బెళగల్: స్కూటర్ ఎత్తుకెళ్లిన దొంగను పట్టుకుంటే... బంగారు నగలు లభించిన ఘటన మండల కేంద్రం సి.బెళగల్‌లో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు వివరాలు.. బుధవారం సి.బెళగల్ చెందిన కొందరు యువకులు గ్రామ శివారులోని కంబదహాల్ గ్రామ రోడ్డులో వ్యవసాయ పొలం దగ్గర తమ స్కూటర్లను నిలిపి పొలంలో ఉన్న ఉపరితల ట్యాంక్‌లో స్నానం చేస్తున్నారు. అయితే వారితో పాటు ఓ కొత్త యువకుడు సైతం ట్యాంక్‌లో స్నానం చేశాడు. కొద్ది సేపటికే ట్యాంక్ నుంచి బయటకు వచ్చిన ఆ యువకుడు సి.బెళగల్‌కు చెందిన శివ స్కూటర్‌ను ఎత్తుకెళ్లాడు. అనుమానంతో సదరు యువకుడి కోసం గాలిస్తుండగా కంబదహాల్ సమీపంలో స్కూటర్‌తో కనిపించాడు. వెంటనే ఆ యువకుడిని పట్టుకొని సి.బెళగల్‌లో పోలీసులకు అప్పగించేందుకు వెళ్తుండగా నిందితుడి దగ్గర బంగారు ఆభరణాలున్న ప్యాకెట్ గుర్తించారు. స్కూటర్‌తో పాటు బంగారు దొంగతనం బయటకు వస్తుందని భయపడి కొటారుమిట్ట దగ్గర ఉన్న వంకలోకి దూకాడు. నిందితుడిని వెంబడించిన స్థానికులు వంక నీటి నుంచి బయటకు లాగి పోలీసులకు అప్పగించారు. నిందితుడి దగ్గర దాదాపు ఏడు తులాల బంగారు, వెండి ఆభరణాలన్నాయి. అతడిని విచారిస్తున్నామని ఎస్‌ఐ పరమేష్‌నాయక్ తెలిపారు.

పీఠాధిపతికి తులాభారం