
ప్రభుత్వంతో పోరాడి న్యాయం చేయండి
కర్నూలు(టౌన్): గత ప్రభుత్వంలో ఎండీయూ వాహనాల ద్వారా ప్రజలకు రేషన్ పంపిణీ చేశామని, అయితే అర్ధాంతరంగా తొలగించిన తమకు మద్దతుగా ప్రభుత్వంతో పోరాడి న్యాయం చేయా లని ఎండీయూ ఆపరేటర్స్ యూనియన్ సూర్యనారాయణ, కిషోర్ కుమార్, రవికుమార్, శ్రీనివాసులు విన్నవించారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక గిప్సన్ కాలనీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అద్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2021 సంవత్సరం నుంచి ఎండీయూ వాహనాలతోనే జీవనోపాధి పొందుతున్నట్లు చెప్పారు. కరోనా సమయంలో రెడ్‌జోన్‌లో ఉన్న ప్రజలకు సైతం ఇంటింటికీ రేషన్ పంపిణీ చేశామన్నారు. కూటమి ప్రభుత్వ నిర్ణయం వల్ల 18,520 కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. స్పందించిన ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ డిమాండ్ల సాధనకు కలసికట్టుగా ప్రభుత్వంపై పోరాటం సాగిద్దామన్నారు. ప్రభుత్వ పథకాలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తోందన్నారు. అగ్రిమెంట్ ప్రకారం 2027 వరకు ఎండీయూ వాహనాలను కొనసాగించాలన్నారు.
ఎండీయూ వాహన ఆపరేటర్ల వినతి