
మృత్యువు మింగేసింది!
గోనెగండ్ల: ‘అమ్మా.. నేను నీ వెంట వస్తా.. అంటూ పొలం పనులకు పోతున్న తల్లుల వెంట వెళ్లిన ఇద్దరు బాలికలు విగతజీవులుగా ఇంటికి చేరారు. పొలంలోని నీటి తొట్టిలో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన ఇద్దరు బాలికలు ప్రమాదవశాత్తూ మృత్యువాత పడ్డారు. ఈ విషాద సంఘటన మండల కేంద్రం గోనెగండ్లలో శుక్రవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గోనెగండ్లలోని కురువ పేటకు చెందిన బోయ మందకల్, సరస్వతి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఈ దంపతులు గ్రామంలోనే కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి రెండవ కూతురు మాధురి(12) గోనెగండ్ల హైస్కూల్‌లో ఆరవ తరగతి వరకు చదివి మధ్యలో బడి మానేసింది. అలాగే అదే కాలనీకి చెందిన బోయ రంగప్ప నాయుడు, మహేశ్వరి దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరి రెండో కుమార్తె మంజుల (12) కూడా బడి మానేసింది. రోజు మాదిరిగా సరస్వతి, మహేశ్వరిలు శుక్రవారం ఉదయం అదే కాలనీకు చెందిన ఓ రైతు పొలంలో పత్తి విత్తనాలు విత్తేందుకు బయలుదేరారు. తల్లుల వెంట వారి బిడ్డలు మాధురి, మంజుల కూడా వెంట వెళ్లారు. తల్లులు పొలంలో పత్తి విత్తనాలు విత్తుతుండగా మధ్యాహ్న సమయంలో ఆ చిన్నారులు ఇద్దరు పొలంలోని నీటి తొట్టి దగ్గరకు వెళ్లారు. సరదాగా ఈత కొట్టేందుకు అందులోకి దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో ఇద్దరు నీటిలో మునిగి పోయారు. పొలంలో పనులు చేస్తున్న తల్లులు పిల్లలు కనిపించడం లేదని గాలిస్తుండగా అనుమానంతో నీటి తొట్టిలో చూశారు. నీటిలో మునిగి పోయిన చిన్నారులను చూసి గుండెలు బాదుకున్నారు. చుట్టు పక్కల పొలం రైతులు వచ్చి చిన్నారులను బయటకు తీశారు. గోనెగండ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే బాలికలు మృతిచెందారని వైద్యులు నిర్ధారించారు. ఒకే కాలనీలో ఇద్దరు చిన్నారుల మృతితో విషాదం నెలకొంది. తల్లిదండ్రులు, కుటుంబీకులు రోదిస్తున్న తీరును చూసిన పలువురు కంటతడి పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బాలికల వివరాలు సేకరించారు.
పొలం నీటి తొట్టిలో మునిగి
ఇద్దరు బాలికలు మృతి
సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి
ప్రమాదం
గోనెగండ్లలో విషాదం

మృత్యువు మింగేసింది!

మృత్యువు మింగేసింది!

మృత్యువు మింగేసింది!