
ఎమ్మిగనూరు రూరల్: మూలమలుపే మృత్యువైంది. క్షణాల్లో ఇద్దరి ప్రాణాలను గాల్లో కలిపేసింది. రెప్పపాటు కాలంలోనే ఒకరి తలను మొండెం నుంచి వేరు చేసి.. మరొకరి తలలోని మెదడును ఛిద్రం చేసింది. ఇంతటి ఘోర రోడ్డుప్రమాదం ఎర్రకోట గ్రామ సమీపంలో విద్యుత్ సబ్ స్టేషన్ మూలమలుపు వద్ద శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని కడిమెట్ల గ్రామానికి చెందిన బోయ కేశన్న(32) సొంత పని నిమిత్తం ఎమ్మిగనూరుకు వచ్చాడు. సాయంత్రం స్వగ్రామానికి వెళ్లేందుకు వేచి చూస్తుండగా.. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంకు చెందిన రజాక్(35) ఎడ్ల కొమ్ములు నునుపు చేసేందుకని బైక్‌పై ఎమ్మిగనూరుకు వచ్చాడు. ఇదే వృత్తి నిమిత్తం రజాక్ కడిమెట్లకు వెళ్తుండగా కేశన్న కూడా అతని బైక్ ఎక్కాడు. ఇద్దరూ కలిసి కడిమెట్లకు బయలుదేరారు. ఎర్రకోట సమీపంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్దకు రాగానే మూలమలుపు ఉండటంతో కర్నూలు నుంచి ఆదోనికి మద్యం బాక్సులతో వెళ్తున్న బొలెరో వాహనం వేగంగా బైక్‌ను ఢీకొంది. ప్రమాదంలో రజక్ తల తెగి పడింది. కేశన్న తలలోని మెదడు బయటకు వచ్చింది. కొన ఊపిరితో ఉన్న కేశన్న ప్రభుత్వాసుపత్రికి తరలించగా కొద్దిసేపటికే మృతి చెందాడు. కేశన్నకు భార్య శారద, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. రజాక్ కుటుంబ వివరాలు తెలియాల్సి ఉంది. రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రూరల్ ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.
ఘటనా స్థలంలో రోడ్డుపై చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు
కేశన్న మృతదేహం రజాక్(ఫైల్)