
గడ్డి వామి పడి బాలుడి మృతి
తుగ్గలి: గడ్డి వామి మీద పడి ఓ బాలుడు మృతిచెందిన ఘటన శనివారం మండలంలోని రాంపల్లిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన బుచ్చి రామాంజిని, సరస్వతి దంపతుల కుమారుడు 7వ తరగతి చదివే దివ్యాంగుడు రమేష్(13) పశువుల మేతకోసం వామిదొడ్డికి వెళ్లాడు. అక్కడ గడ్డివామి తవ్వుతుండగా వామి పైకప్పు మీద పడి ఊపిరాడక మృతి చెందారు. కుమారుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు వామిదొడ్డికి వెళ్లి గాలించారు. అక్కడ గడ్డివామి పైకప్పు కింద పడి పోవడాన్ని చూసి అనుమానంతో గడ్డిని తొలగించి చూడగా విగతజీవిగా పడిఉండటంతో బోరున విలపించారు.
కేశఖండనకు వెళ్తూ తిరిగి రాని లోకాలకు..
● రోడ్డుప్రమాదంలో
యువకుడి దుర్మరణం
పాణ్యం: మేనల్లుడి కేశఖండన కోసం వెళ్తూ ఓ యువకుడు బైక్ అదుపు తప్పిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. హైవే పోలీసులు తెలిపిన వివరాలు.. కేఆర్‌ఆర్ తండాకు చెందిన శంకర్‌నాయక్, మంగీబాయి కుమారుడు జానవత్ మనోజ్‌నాయక్(28) తన సోదరి కుమారుడు (మేనల్లుడి) కేశఖండన వచ్చే మంగళవారం నంద్యాలలో ఉండటంతో ఏర్పాట్ల నిమిత్తమని శనివారం మధ్యాహ్నం బయలుదేరాడు. మండల కేంద్రంలోని ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద బైక్ అదుపు తప్పి కిందపడ్డాడు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. రెండేళ్ల క్రితం దిగుబడి సరిగా రాలేదనే మనస్తాపంతో భర్త ఆత్మహత్య చేసుకోవడం, ఇప్పుడు కుమారుడు రోడ్డుప్రమాదంలో మృతిచెందడంతో మంగీబాయి, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. మృతుడికి తల్లితోపాటు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల జీజీహెచ్‌కు తరలించారు.
ఓబులాపురం మిట్ట వద్ద..
డోన్ రూరల్: మండల పరిధిలోని ఓబులాపురం మిట్ట వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓబులాపురం గ్రామానికి చెందిన షేక్‌లాలు(52) మృతి చెందాడు. కాశిరెడ్డినాయన ఆలయం వద్ద నుంచి 44వ జాతీయ రహదారిని దాడుతుండగా కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

గడ్డి వామి పడి బాలుడి మృతి