
బాలుడిని బలిగొన్న నీటి గుండం
● మద్దిలేటి నరసింహస్వామి ఆలయంలో అపశ్రుతి
బేతంచెర్ల: మండల పరిధిలోని వైష్ణవ పుణ్యక్షేత్రం మద్దిలేటి నరసింహస్వామి ఆలయ ఆవరణలోని నీటి గుండం ఓ బాలుడిని బలితీసుకుంది. క్షేత్ర పరిధిలోని నీటి గుండంలో పడి అంబాపురం గ్రామానికి చెందిన జూలకంటి రామాంజనేయులు, పుల్లమ్మ దంపతుల పెద్ద కుమారుడు 9వ తరగతి చదివే మణిధర్ (14) మృతిచెందాడు. తన మేనమామ పిల్లల పుట్టు వెంట్రుకల కార్యక్రమానికి హాజరైన మణిధర్.. మరో ఇద్దరు చిన్నారులతో కలిసి నీటి గుండంలో సరదాగా ఈతకు దిగారు. ఈత రాకపోవడంతో మణిధర్ నీటిలో మునిగి గల్లంతయ్యాడు. వెంట ఉన్న చిన్నారులకు కూడా ఈత రాకపోవడంతో కాపాడలేకపోయారు. బంధువులు, కుటుంబ సభ్యులు నీటి గుండం వద్దకు చేరుకుని గాలించినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న డోన్ ఆర్డీఓ నరసింహులు, బేతంచెర్ల సీఐ డి.వెంకటేశ్వరరావు, తహసీల్దార్ ప్రకాశ్‌బాబు ఘటనా స్థలానికి చేరుకొని బనగానపల్లె ఫైర్ సిబ్బంది, గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి 7గంటల సమయంలో మణిధర్ మృతదేహాన్ని వెలికితీశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

బాలుడిని బలిగొన్న నీటి గుండం