
అమ్మా.. నేనేమి చేశాను నేరం?
కోడుమూరు రూరల్: బకెట్‌లోని ఈ మృతశిశువును చూస్తే ‘అమ్మా.. నేనేమి నేరం చేశాను. నీవు చేసిన తప్పును కప్పి పుచ్చుకునేందుకు పురిట్లోనే నన్ను ఈ లోకం నుంచి దూరం చేశావా’ అన్నట్లంది కదూ.. స్థానిక సంతమార్కెట్ ప్రాథమిక పాఠశాల వద్ద శనివారం సాయంత్రం మృత మగ శిశువును మాయతో పాటు ఎవరో బకెట్‌లో ఉంచి వదిలి వెళ్లారు. ఈ విషయం పట్టణంలో దావానలంలా వ్యాపించడంతో ప్రజలు పెద్దఎత్తున అక్కడికి చేరుకుని నెలలు నిండక ముందే అబర్షన్ చేయించి ఉండవచ్చని కొందరు.. పురిటిలోనే చనిపోవడంతో వదిలేసి పోయారని ఇంకొందరూ చర్చించుకున్నారు. మరికొందరు మాత్రం మగ మృత శిశువును వదిలించుకోవడానికి మనసెట్ల వచ్చిందో అంటూ శాపనార్థాలు పెట్టారు.
వృద్ధుడి ఆత్మహత్య
కొలిమిగుండ్ల: మండల పరిధిలోని అంకిరెడ్డిపల్లెలో ఓ వ్యక్తి శనివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలిల మేరకు.. గ్రామానికి చెందిన చాకలి రాముడు (67) పనికి వెళ్లకుండా మద్యానికి బానిసయ్యాడు. దీంతో కుమారుడు కొత్త రాయుడు తండ్రిని మందలించాడు. మనస్తాపానికి లోనైన అతను జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరివేసుకున్నాడు. కొద్ది సేపటి తర్వాత కుటుంబ సభ్యులు గమనించి చూడగా అప్పటికే మృతి చెందాడు. పొలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతికి గల కారణాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.