
భూ వివాదాలతోనే లక్ష్మినారాయణ హత్య
ఆలూరు రూరల్: కాంగ్రెస్ నేత, ఎమ్మార్పీఎస్ రాయలసీమ అధ్యక్షుడు లక్ష్మినారాయణ హత్యకు భూ వివాదాలు, పంచాయతీలే కారణమని అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా తెలిపారు. ఆలూరులోని పోలీసు సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. లక్ష్మినారాయణ హత్య కేసులో 14 మందిపై కేసు నమోదు చేశామన్నారు. అయితే పది మందిని నిందితులుగా గుర్తించామన్నారు. లక్ష్మినారాయణ కుమారుడు వినోద్ ఫిర్యాదు చేసినట్లు వైకుంఠం ప్రసాద్, వైకుంఠం మల్లికార్జున, మల్లేష్, చికెన్ రామాంజిలపై కేసు దర్యాప్తులో ఉందని, వీరి పాత్ర ఉంటే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణానికి చెందిన ప్రధాన నిందితులైన పూనుగొండ్ల రాజేష్, బేపర్ గౌసియా, కత్రిమల సౌభాగ్యలను పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య, ఆలూరు సీఐ రవి శంకర్ రెడ్డితో కలిసి శుక్రవారం హైవే 167లోని నక్కనదొడ్డి గ్రామం వద్ద అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. ఇదే కేసులో ముద్దాయిలుగా ఉన్న పెద్దన్న, బోయ మేకల శ్రీనివాసులు, బోయ గోవిందు, బోయ రాము, వడ్డే నవీన్, ధర్మ, మనోహర్లను అరెస్టు చేయాల్సి ఉందన్నారు.
హత్యకు కారణమైన వివాదాలు
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని ఆలూరు రోడ్డులో ఉన్న 1.10 ఎకరాల ఇంటి స్థలాల భూమి, సిద్ధార్థ కాలనీలోని 9 ఎకరాల దేవదాయ భూమి పంచాయతీ విషయంలో గుంకతల్లుకు చెందిన గౌసియా, రాజేష్‌లతో లక్ష్మినారాయణకు వివాదం నడుస్తోంది. ఈ భూమిలోని 4 ఎకరాల్లో లక్ష్మినారాయణ ప్లాట్లు వేసి విక్రయించాడు. గుంతకల్లు మండలం కొనకొండ్ల చెందిన ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం విషయంలోనూ ఆయన పంచాయతీ చేసినట్లు తెలిసింది. అలాగే పెద్దన్నకు చెందిన 8 ఎకరాల భూమికి ఏడేళ్ల క్రితం లక్ష్మినారాయణ తన అత్త పేరిట నకిలీ పాసు పుస్తకాలు సృష్టించాడు. ఈ భూమి వివాదం కోర్టులో ఉంది. ఈ విషయంలో వివాదంతో పాటు పెద్దన్నపై లక్ష్మినారాయణ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించారు. అదేవిధంగా నాలుగు నెలల క్రితం పెద్దన్న, రాజేష్, గౌసియాలను లక్ష్మినారాయణ బహిరంగంగా దూషించడంతో వారంతా ఆయనను అంతమొందించాలని నిర్ణయించుకున్నారు.
పథకం ప్రకారమే హత్య
● రెండు నెలల క్రితం హిందూపురంలో టిప్పర్ కొనుగోలు చేశారు.
● గత నెల 27న ఉదయం పెద్దయ్య ఇంటి వద్ద సమావేశమయ్యారు.
● అదే రోజు మధ్యాహ్నం లక్ష్మినారాయణ గుంతకల్లు నుంచి తన స్వగ్రామమైన చిప్పగిరికి ఇన్నోవా కారులో బయలుదేరాడు.
● రాజేష్ అతన్ని మరో కారులో అనుసరించి టిప్పర్ డ్రైవర్ మేకల శ్రీనివాసులు, మరో వ్యక్తి ధర్మన్నకు సమాచారం ఇస్తూ వచ్చాడు.
● మరో నిందితుడు రాము మార్గమధ్యంలో ఉండి టిప్పర్ డ్రైవర్‌ను అప్రమత్తం చేశాడు.
● లక్ష్మినారాయణ కారు గుంతకల్లు సమీపంలోని రైల్వే బ్రిడ్జి వద్దకు రాగానే డ్రైవర్ శ్రీనివాసులు ఇన్నోవా కారును బలంగా ఢీకొట్టాడు.
● పక్కనే వేచి ఉన్న పెద్దన్న కొడవలితో లక్ష్మినారాయణ తలపై నరికాడు.
● మరో వ్యక్తి వడ్డే నవీన్ వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్డుతో ఆయన తలపై కొట్టాడు.
● మిగిలిన నిందితులు రహదారిలో ఎవరూ రాకుండా జాగ్రత్త వహించారు.
● లక్ష్మినారాయణపై దాడి అనంతరం అందరూ కలిసి పరారయ్యారని ఏఎస్పీ హుసేన్ పీరా విలేకరులకు వెల్లడించారు.
● విలేకరుల సమావేశంలో పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య, ఆలూరు సీఐ రవి శంకర్ రెడ్డి, హొళగుంద ఎస్‌ఐ దిలీప్ కుమార్, ఆలూరు ఎస్‌ఐ మహబూబ్ బాషా, చిప్పగిరి ఎస్‌ఐ శ్రీనివాసులు పాల్గొన్నారు.