
లంచం అడిగితే సమాచారమివ్వండి
కర్నూలు: ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే (లంచం అడిగితే) టోల్‌ఫ్రీ నెంబర్ 1064కి కాల్ చేసి సమాచారం అందించాలని అవినీతి నిరోధక శాఖ కర్నూలు రేంజ్ డీఎస్పీ దివిటి సోమన్న ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దాదాపు 11 నెలల కాలంగా ఏసీబీ డీఎస్పీ పోస్టు ఖాళీగా ఉండటంతో ప్రభుత్వం ఇటీవల సోమన్నను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం కలెక్టరేట్ వెనక ఎ.క్యాంప్‌లో ఉన్న ఏసీబీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతపురం జిల్లా కనగానపల్లె మండలం వేపకుంట గ్రామానికి చెందిన సోమన్న 1991లో ఎస్‌ఐ హోదాలో పోలీసు శాఖలో చేరారు. క్రిష్ణగిరి, సంజామల, నందవరం, వెల్దుర్తి, అనంతపురం పీటీసీలో విధులు నిర్వహించారు. సీఐగా పదోన్నతి పొందిన తర్వాత సీఐడీ, ప్యాపిలి, ఆదోని తాలూకా, లక్కిరెడ్డిపల్లె పీఎస్‌లో పనిచేశారు. 2020లో డీఎస్పీగా పదోన్నతి పొంది సీఐడీ, ఆదోని డీఎస్పీగా పనిచేశారు. ప్రస్తుతం అమరావతి హెడ్ క్వార్టర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సోమన్నను కర్నూలు రేంజ్ ఏసీబీ విభాగానికి నియమించడంతో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అవినీతి నిర్మూలనకు ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలన్నారు. అవినీతి అధికారుల సమాచారం తన ఫోన్ నెంబర్ 9440446178కు కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు.
టోల్‌ఫ్రీ నెంబర్ 1064
ఏసీబీ నూతన డీఎస్పీ దివిటి సోమన్న