
ప్రలోభాలతో మేయర్ పదవిని లాక్కునేందుకు టీడీపీ కుట్ర
కర్నూలు(సెంట్రల్): అప్రజాస్వామికంగా మేయర్ పదవి నుంచి తనను దించేందుకు టీడీపీ ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేస్తోందని కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య ఆరోపణలు చేశారు. టీడీపీ నాయకుల ప్రలోభాలకు నికార్సయిన వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు లొంగడం లేదని దీంతో ఎల్లో మీడియాలో కథనాలు రాయించి దుష్ప్రచారం చేయిస్తున్నారన్నారు. ఆదివారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ కర్నూలు నగర కార్పొరేటర్లు, పార్టీ నాయకులతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇటీవల ఎల్లో మీడియాలో తనపై వచ్చిన కథనాలకు వివరణ ఇచ్చారు. తాను 1987 నుంచి రాజకీయాల్లో ఉన్నానని, రెండుసార్లు ఎంపీగా పోటీ చేశానని, ఒక్కసారి జెడ్పీ ఫ్లోర్ లీడర్‌గా పనిచేశానని, ప్రస్తుతం కర్నూలు మేయర్‌గా ఉన్నానని తెలిపారు. అవినీతి మరక లేకుండా 30 ఏళ్ల నుంచి ప్రజల పక్షాన రాజకీయాలు చేస్తున్నానని వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కర్నూలు మేయర్ పదవి కోసం అడ్డదారులు తొక్కుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తానుగాని, తమ పార్టీ కార్పొరేటర్లుగాని వారికి సహకరించకపోవడంతో ఎల్లో మీడియాలో లేనిపోని ఆరోపణలు చేస్తూ కథనాలను రాయిస్తున్నారని చెప్పారు. తమ కుటుంబానికి వారసత్వంగా వచ్చిన ఆస్తులు ఉన్నాయని, తన భార్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అని, ఆమె రిటైర్‌మెంట్ బెనిఫిట్స్‌తోనే ఇటీవల తాను రెండు ప్లాట్లను చట్టబద్ధంగా కొనుగోలు చేశానన్నారు. అలాగే బాలసాయిబాబా ట్రస్టు నుంచి తాను రూ.77 లక్షలను అప్పుగా చెక్‌రూపంలో తీసుకున్నానని, అయితే అది టీడీఆర్ బాండ్ సొమ్ము అని టీడీపీ నాయకులు ఆరోపణలు చేయడం దుర్మార్గమన్నారు. కోటి రూపాయల టీడీఆర్ బాండ్ విలువలో రూ.77 లక్షల సొమ్మును లంచంగా ఎలా ఇస్తారన్న ఇంకితజ్ఞానం టీడీపీ నాయకులకు లేదా అని ప్రశ్నించారు. తాను తీసుకున్నదని అప్పు అని, అప్పు ఇచ్చే వారు ఎలా తెచ్చి తనకు ఇచ్చిన తనకేమి సంబంధమని ప్రశ్నించారు. టీడీఆర్ బాండ్ల సొమ్ములో అక్రమాలు జరిగాయనుకుంటే విచారణ చేయించాలని, అందులో తన పాత్ర ఉంటే నిరూపించాలని సవాల్ విసిరారు. టీడీపీ నాయకుల రెడ్‌బుక్ రాజ్యాంగాలకు భయపడేది లేదని, అవసరమైతే జైలుకు వెళ్లడానికై నా..లేదంటే ప్రత్యర్థులపై కలబడడానికై నా తాను సిద్ధంగా ఉన్నానని హెచ్చరించారు. తాను మాత్రం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాటను విడిచి పెట్టనని, ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా భయపడనని, దమ్ముంటే తన పదవిపై అవిశ్వాస తీర్మానం పెట్టుకోవాలని టీడీపీ నాయకులకు సవాల్ విసిరారు. ఒకరిద్దరూ వైఎస్‌ఆర్‌సీపీ కార్పొరేటర్లు అమ్ముడు పోయినంత మాత్రన అందరూ వెళ్తారన్న భ్రమలో ఉన్నారని, అందులో భాగంగా బేరసారాలు వేసి తెల్లముఖాలు వేశారని ఎద్దేవా చేశారు. నెల్లూరు నుంచి బతకడానికి కర్నూలు వచ్చిన ఓ వ్యక్తి కనీసం కార్పొరేటర్‌గా కూడా గెలవలేదని, ఆయన కూడా తనపై లేని పోని ఆరోపణలు చేస్తున్నారని, పద్ధతిగా మాట్లాడకపోతే తగిన బుద్ధి చెబుతానని పరోక్షంగా సోమిశెట్టి వెంకటేశ్వర్లును హెచ్చరించారు.
వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు తలొగ్గరు
ఎల్లో మీడియాలో అంతా దుష్ప్రచారమే
‘రెడ్‌బుక్’కు భయపడేది లేదు
విలేకరుల సమావేశంలో
కర్నూలు మేయర్ బీవై రామయ్య
వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లను ఎవరూ కొనుగోలు చేయలేరు
వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లను ఎవరూ కొనుగోలు చేయలేరని, తామంతా మేయర్ బీవై రామయ్యపై పూర్తి విశ్వాసంతో ఉన్నామని డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుకరెడ్డి అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా తామంతా వైఎస్సార్‌సీపీ కొనసాగుతామని చెప్పారు.
బీసీ కావడంతోనే..
మేయర్ బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో టీడీపీ నాయకులు, ఇతర కూటమి నేతలు టార్గెట్ చేశారని వైఎస్సార్‌సీపీ నాయకుడు సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు. ఆ పదవి నుంచి అయన్ను తప్పించేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీతో పాటు బీసీ, బోయ సామాజిక వర్గాలు మేయర్‌కు అండగా ఉంటాయన్నారు. కార్పొరేటర్లు దండు లక్ష్మీకాంతరెడ్డి, నారాయణరెడ్డి, లక్ష్మీరెడ్డి, గాజుల శ్వేతారెడ్డి, విక్రమసింహారెడ్డి, కృష్ణకాంత్, షేక్ అహ్మద్, యూనూస్, నాయకులు పెద్దన్న, కటారి సురేష్, మల్లి, రైల్వే ప్రసాదు, ప్రశాంత్, బెల్లం మహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.