ప్రజల రక్షణ మరిచి ! | - | Sakshi
Sakshi News home page

ప్రజల రక్షణ మరిచి !

Mar 20 2025 1:55 AM | Updated on Mar 20 2025 1:49 AM

నిబంధనలు నీట ముంచి..
● యథేచ్ఛగా ఇంజిన్‌ బోటు ప్రయాణం ● కలెక్టర్‌ ఆదేశాలు బేఖాతర్‌ ● కెపాసిటీకి మించి లైఫ్‌ జాకెట్స్‌ లేకుండా ప్రయాణికుల తరలింపు ● ఘాట్‌ నిర్వాహకులకు అధికార పార్టీ నేతల అండదండలు

పగిడ్యాల: శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో ఇంజిన్‌ బోటులో ప్రయాణికుల తరలింపును అడ్డుకోవాలని జిల్లా కలెక్టర్‌ రాజకుమారి ఆదేశించినా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. మూర్వకొండ ఘాట్‌, అర్లపాడు ఘాట్‌ నిర్వాహకులకు అధికార పార్టీ నేతల అండదండలతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కృష్ణానదికి ఇరువైపులా బంధువర్గాలు ఉన్న ప్రజలు ఆయా ప్రాంతాలకు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే వ్యవప్రయసాలు కావడంతో చాలా మంది ఇంజిన్‌ బోట్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఘాట్‌ నిర్వాహకులు కెపాసిటీకి మించి ప్రయాణికులను పడవలో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కనీసం లైఫ్‌ జాకెట్లు లేకుండా ప్రయాణికులను పంపుతున్నారు. మూడు నెలలుగా కొనసాగుతున్న అనధికారిక ఇంజిన్‌ బోటు ప్రయాణంపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఘాట్‌ నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఇంజిన్‌ బోట్లలో కెపాసిటీకి మించి 25 నుంచి 30 మంది ప్రయాణికులను తరలించడమే కాకుండా బైక్‌లను అందులో తరలించి ఒక్కొక్కరి నుంచి రూ. 200ల ప్రకారం వసూలు చేస్తున్నారు. 2007 జనవరి 18న ఇదే మూర్వకొండ ఘాట్‌ నుంచి సింగోటం జాతరకు నాటు పడవలో వెళ్తూ 60 మంది జల సమాధి అయిన ఘటన నేటికి కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. అయినా కాలం చెల్లిన ఫిట్‌నెస్‌ లేని ఇంజిన్‌ బోట్లపై ప్రయాణికులు భయం భయంగా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ అనుమతి (లైసెన్స్‌) లేకపోయినప్పటికీ అధికార పార్టీ ఎమ్మెల్యే వర్గీయుల కనుసన్నల్లో అనధికార ప్రయాణానికి పచ్చ జెండా ఊపడంతో ఘాట్‌ నిర్వాహకులకు కాసుల పంట పండుతోంది. ఈ విషయమై తహసీల్దార్‌ శివరాముడును వివరణ కోరగా.. ఇంజిన్‌ బోటు ప్రయాణానికి ఎలాంటి అనుమతి ఇవ్వలేదని విచారించి తగు చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement