యంత్రాలతో వ్యవసాయం లాభదాయకం

- - Sakshi

ప్రభుత్వానికి రుణపడి ఉన్నాం

ఆంజనేయ రైతు నేస్తం సీహెచ్‌సీ గ్రూపునకు రూ.15 లక్షల విలువ యంత్రపరికరాలు 40 శాతం సబ్సిడీపై లభించాయి. ట్రాక్టరుతో పాటు మూడు రోటావేటర్లు తీసుకున్నాం. ఏ పరికరాలు అవసరమో వాటిని తీసుకొని తక్కువ అద్దెలతో రైతులకు ఇస్తున్నాం. సీహెచ్‌సీల ఏర్పాటుతో వ్యవసాయంలో యాంత్రీకరణ వినియోగం పెరిగింది. రైతులకు అవసరమైన యంత్ర పరికరాలు ఇస్తున్న ప్రభుత్వానికి రుణపడి ఉన్నాం – రామాంజనేయులు,

బ్రాహ్మణపల్లి, ఓర్వకల్లు మండలం

కర్నూలు(అగ్రికల్చర్‌)/కల్లూరు: యంత్రాలతో వ్యవసాయం చేయడం ద్వారా రైతులు లాభాలు పొందవచ్చని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ గుమ్మళ్ల సృజన అన్నారు. శుక్రవారం కర్నూలు శివారులోని సెయింట్‌ క్లారెట్‌ ఇంగ్లిషు మీడియం స్కూల్‌ మైదానంలో వైఎస్సార్‌ యంత్ర సేవ పధకం మెగా మేళా–2.0 కార్యక్రమాన్ని కలెక్టర్‌, ప్రజాప్రతినిధులు, అధికారులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మొత్తం 159 సీహెచ్‌సీ గ్రూపులకు 96 ట్రాక్టర్లు, ఒక హార్వెస్టర్‌, 442 ఇంప్లిమెంట్స్‌ పంపిణీ చేశారు. వీటి పూర్తి విలువ రూ.12,88,48,373 ఉండగా.. ప్రభుత్వం రూ.4,66,09,995 సబ్సిడీ ఇచ్చింది. గుంటూరులో జరిగిన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి సీహెచ్‌సీ గ్రూపులకు సబ్సిడీ విడుదల చేశారు. కలెక్టర్‌ సృజన, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి, మేయర్‌ బీవై రామయ్య తదితరులు 159 సీహెచ్‌సీ గ్రూపులకు సబ్సిడీ కింద రూ.4,66 కోట్ల మెగా చెక్‌ను అందచేశారు.

● కలెక్టర్‌ సృజన మాట్లాడుతూ... సంప్రదాయ వ్యవసాయానికి స్వస్తి పలికి ఆధునిక వ్యవసాయం దిశగా రైతులు ఆడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో 466 ఆర్‌బీకేలున్నాయని.. అన్ని అర్‌బీకేల్లోను సీహెచ్‌లు ఏర్పా టు అయ్యాయన్నారు. వ్యవసాయంలో యాంత్రీకరణ వినియోగాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం గ్రామాల వారీగా కస్టమ్‌ హయ్యరింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేసి ఇందులో ట్రాక్టరుతో పాటు రైతులకు అవసరమైన అన్ని రకాల పరికరాలు ఉండే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పెట్టుబడి వ్యయాన్ని తగ్గించి రైతులు నికరాదాయాన్ని పెంచుకునేందుకు యాంత్రీకరణ చక్కటి అవకాశమని స్పష్టం చేశారు.

● జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. కూలీల కొరతను, పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకొని దిగుబడిని పెంచుకొనేందుకు యాంత్రీకరణ దిశగా రైతులు కదలాలని సూచించారు.

● పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గొప్ప ఆశయంతో రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఇంప్లిమెంట్స్‌ పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వ్యవసాయంలో యాంత్రీకరణ వినియోగాన్ని గణనీయంగా పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

● కర్నూలు నగరపాలక సంస్థ మేయర్‌ బీవై రామయ్య మాట్లాడుతూ... రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం పాలించిన చంద్రబాబు వ్యవసాయాన్ని దండగ చేశారని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పండుగ చేశారని తెలిపారు. విత్తు నుంచి పంట విక్రయం వరకు రైతుకు ఎన్నో విధాల తోడ్పడే విధంగా రైతుభరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం శుభపరిణామమని పేర్కొన్నారు.

● జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌, రాష్ట్ర మండలి సభ్యుడు బెల్లం మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ... గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రైతుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఒకేరోజు 96 ట్రాక్టర్లు పంపిణీ చేయడం విశేషమన్నారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి... ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతుల పక్షపాతి అన్నారు. వైఎస్‌ఆర్‌ యంత్రసేవ పథకం కింద ఇప్పటి వరకు పంపిణీ చేసిన ట్రాక్టర్లు, ఇంప్లిమెంట్స్‌ గురించి జిల్లా వ్యవసాయాధికారి పీఎల్‌ వరలక్ష్మి వివరించారు.

● కార్యక్రమం ముగిసిన తర్వాత కలెక్టర్‌, ప్రజాప్రతినిధులు ట్రాక్టర్లను పరిశీలించారు. సీహెచ్‌సీ గ్రూపు సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ సృజన ట్రాక్టర్లను పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ట్రాక్టరు ఎక్కి స్టీరింగ్‌ పట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార కేంద్రబ్యాంకు సీఇవో రామాంజనేయులు, ఎల్‌డీఎం ఎస్‌ఆర్‌ రామచంద్రరావు, ఏడీఏలు సాలురెడ్డి, మహమ్మద్‌ ఖాద్రీ, సునీత, గిరీష్‌, జిల్లా ఉద్యాన అధికారి పి.రామంజనేయులు, మండల వ్యవసాయ అధికారులు శ్రీనివాసరెడ్డి, విశ్వనాథ్‌, రవిప్రకాశ్‌, అక్బర్‌బాష, సురేష్‌, అశోక్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ యంత్రసేవ పథకం కింద

ట్రాక్టర్లు, ఇంప్లిమెంట్ల పంపిణీ

159 సీహెచ్‌సీ గ్రూపులకు

రూ.4.66 కోట్ల సబ్సిడీ విడుదల

సీహెచ్‌సీ గ్రూపు ప్రతినిధులకు

మెగా చెక్‌ అందచేసిన కలెక్టర్‌,

ప్రజాప్రతినిధులు

Read latest Kurnool News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top