మచిలీపట్నంఅర్బన్: ప్రజలకు మరింత చేరువలో ఆధార్ సేవలు అందుబాటులోకి వచ్చాయని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. సోమవారం ఉదయం స్థానిక కొజ్జిలిపేట కెనెడీ రోడ్డులో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఆధ్వర్యంలో నూతన ఆధార్ సేవా కేంద్రాన్ని జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ బండి రామకృష్ణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం ఆధార్ ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ సేవకు అనుసంధానమైందని తెలిపారు. బ్యాంక్ ఖాతాలు, పెన్షన్లు, ప్రభుత్వ పథకాలు, ఇతర సేవలన్నింటికీ ఆధార్ తప్పనిసరిగా మారిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ ప్రాంతాల్లో మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉండగా, ఇప్పుడు మచిలీపట్నంలో కేంద్రం ప్రారంభం కావడం ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. యూఐడీఏఐ డైరెక్టర్ కె.ఎం. భారతి, అసిస్టెంట్ మేనేజర్ వరప్రసాద్, బి.ఎల్.ఎస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ జోనల్ మేనేజర్ మనీష్ జవాల్కర్, రీజనల్ మేనేజర్ శ్రీనివాస్ కుమార్, క్లస్టర్ మేనేజర్ హరినాథ్, కృష్ణాజిల్లా ఆధార్ కేంద్రం ఆపరేటింగ్ మేనేజర్ ఎస్. లలిత, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్, గోపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి కొల్లు రవీంద్ర


