కాలువల్లో అవినీటి ప్రవాహం | - | Sakshi
Sakshi News home page

కాలువల్లో అవినీటి ప్రవాహం

May 24 2026 1:27 AM | Updated on May 24 2026 1:27 AM

పనులు చేయకుండానే నిధులు మింగేసేందుకు సన్నాహాలు

ఉమ్మడి జిల్లాలో 823 పనులు చేపట్టేందుకు రూ.37.9 కోట్లు పనులు కట్టబెట్టేందుకు కమీషన్ల కోసం పచ్చనేతల డిమాండ్‌ పంట కాలువల్లో తొలగింపునకు నోచుకోని పూడిక, తూటికాడ చివరి ఆయకట్టుకు సాగు నీరు అందటం కష్టమంటున్న రైతులు

పూడిక తీయకపోతే ముప్పే

ఖరీఫ్‌లో నీరందేలా చూడాలి

పనులు చేయకుండానే నిధులు మింగేసేందుకు సన్నాహాలు

సాక్షి ప్రతినిధి, విజయవాడ: సాగు నీటితో కళకళలాడాల్సిన పంటకాలువల్లో అవి‘నీటి’ ప్రవాహం జోరందుకుంది. ఫలితంగా వచ్చే ఖరీఫ్‌ సీజన్‌లో శివారు పొలా లకు నీటి తడులు అందక ‘పానీ’పట్టు యుద్ధాలు తప్పేలా లేవు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పంట కాలువలు, ఇరిగేషన్‌ డ్రెయిన్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. కృష్ణా డెల్టా పరిధిలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కృష్ణా తూర్పు డెల్టా పరిధిలో కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాలకు సంబంధించి 5.62 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి. కాలువలు అన్నీ పూడిక, గుర్రపు డెక్క, తూటి కాడ, పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. పూడిక, గుర్రపు డెక్క, తూటికాడ తొలగించడంతోపాటు అక్కడక్కడా కాంక్రీట్‌ పనులు, లాకుల షట్టర్లకు మరమ్మతులు చేయాల్సింది. ఇటీవల కాలువల్లో 833 పనులు చేపట్టేందుకు రూ.37.9 కోట్లు మంజూరు చేశారు. పనుల కేటాయింపునకు స్థానిక నియోజకవర్గ ప్రజాప్రతినిధులు ముందుగానే 30 శాతం నిధులు కమీషన్‌ కింద ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. మే నెలలోనే సాగు నీరు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాలువలకు సాగునీరు విడుదల చేస్తే మరమ్మతులు చేయకుండానే కాంట్రాక్టర్లు నిధులు మింగేసే అవకాశం ఉండటంతో పచ్చనేతలు కమీషన్ల కోసం పట్టు పడుతున్నారు. ఫలితంగా కాలువల నిర్వహణ కోసం కేటాయించిన పనుల్లో అవినీతి ఊట ప్రవహిస్తోంది.

గత ఏడాదీ ఇదే తంతు...

గత ఏడాది కాలువల నిర్వహణ పనులను సకాలంలో మంజూరు చేయలేదు. కాలువలకు సాగు నీరు విడుదల చేసిన తరువాత రూ.25 కోట్ల విలువైన 666 పనులను మంజూరు చేశారు. ఎక్కువ శాతం పనులను తూతూ మంత్రంగానే జరిగాయి. ఫలితంగా సాగునీరు పుష్కలంగా ఉన్నా చివరి ఆయకట్టు రైతులు నీరు అందక ఇబ్బందిపడ్డారు. గత ఏడాది జూన్‌ 18 తేదీన కాలువులకు సాగునీరు వదలగా, జూలై చివరి వరకు మరమ్మతులు జరుగుతూనే ఉన్నాయి. కాలువల్లో నీటి ప్రవాహంతో చాలా వరకు తూటి కాడ దిగువకు కొట్టుకుపో కాంట్రాక్టర్లకు తొలగించినట్టు బిల్లులు చేసుకున్నారు. దీంతో పెడన, అవనిగడ్డ, నియోజకవర్గాలో శివారు రైతులకు సాగు నీరు అందలేదు. కోడూరు మండలంలోని బసవానిపాలెం, ఊటగుండం, రామకృష్ణాపురం గ్రామాలకు వెళ్లే 14వ నంబర్‌ కాలువ డెక్క, తూటుకాడతో అధ్వానంగా మారింది. స్వతంత్య్రపురం, ఉల్లిపాలెం, హరిపురం గ్రామాలకు సాగు, తాగునీరు అందించే 11వ నంబర్‌ కాలువ మొత్తం గుర్రపు డెక్కతో నిండిపోయింది. పులిగడ్డ నుంచి దివిసీమకు వచ్చే అవనిగడ్డ ప్రధాన పంట కాలువ, అవనిగడ్డ నుంచి దిగువకు సాగు నీందించే కోడూరు, నాగాయలంక ప్రధాన పంట కాలువల్లో రెండేళ్ల నుంచి పూడికతీత పనులు చేయలేదు. దీంతో ఈ కాలువలు అన్నీ పూడికతో మేట వేశాయి. ఫలితంగా పులిగడ్డ ఎగువన ప్రధాన పంటకాలువ పొంగిపొర్లుతున్నా దిగువ పొలాలకు సాగు నీరు అందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఇరిగేషన్‌ డ్రెయిన్ల దుస్థితి ఇదీ..

చంద్రయ్య, కొమరవోలు డ్రెయిన్‌ల మరమ్మతులకు గత ఏడాది డిసెంబర్‌లోనే రూ.33 కోట్లు మంజూరైనా, స్థానిక ప్రజాప్రతినిధులు కమీషన్ల కోసం కాంట్రాక్టర్లపై ఒత్తిడి తేవడంతో పనులు ముందుకు సాగలేదు. ఏప్రిల్‌ 11వ తేదీన కొమరవోలు డ్రెయిన్‌ మరమ్మతులను రూ.7.72 కోట్లతో ఇద్దరు ప్రజాప్రతినిధులు ప్రారంభించినా, రెండు రోజులపాటు మాత్రమే తూతూ మంత్రంగా ఈ పనులు జరిగాయి. ఈ నిధులను తినేసేందుకు రంగం సిద్ధమైందని విమర్శలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి. దీంతో డ్రెయిన్ల పరిస్థితి అధ్వానంగా మారింది. మరో వైపు బుడమేరుకు పడిన గండ్లను ఇప్పటికీ పూడ్చలేదు.

ప్రధాన పంట కాలువల్లో పూడిక మేట వేసి చాలా చోట్ల మట్టిదిబ్బలుగా దర్శనమిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా పలుచోట్ల ప్రధాన పంట కాలువల్లో గుర్రపుడెక్క, తూడు పెరిగిపోయాయి. వీటిని తొలగించకుండా, పూడిక తీయకుండా కాలువలకు సాగునీరు వదిలినా పంట పొలాలకు సక్రమంగా చేరే పరిస్థితి లేదు.

– బీమా బాబూరావు, రైతు, తిప్పపాలెం, నాగాయలంక మండలం

దివిసీమలోని నాగాయలంక, కోడూరు, మంచిలీపట్నం, కృత్తివెన్ను మండలాల్లో దెబ్బతిన్న అవుట్‌ఫాల్‌ స్లూయిస్‌లను ఆధునికీకరిస్తామని డెప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ గత ఏడాది అక్టోబర్‌లో హామీ ఇచ్చారు. వీటికి సంబంధించి రూ.50 కోట్లతో డీపీఆర్‌ పంపినా నిధులు మంజూరు కాలేదు. దీంతో ఈ ఏడాదీ అవుట్‌ఫాల్‌ స్లూయిస్‌లకు మరమ్మతులు, ఆధునికీకరణ పనులు లేనట్టేనని రైతులు వాపోతున్నారు. కొద్దిపాటి వర్షాలు పడినా 1.30 లక్షల ఎకరాలు ముంపు బారిన పడతాయని ఆందోళన చెందుతున్నారు.

వేసవిలోనే పంట కాలువలకు మరమ్మతులు చేపట్టాలి. వర్షాలు పడితే పనులు సక్రమంగా జరగవు. పంట కాలువలు, ఇరిగేషన్‌ డ్రెయిన్లు, పంట బోదెల్లో పూడిక తీతపనులు చేపట్టాలి. ఈ పనులను సక్రమంగా నిర్వహిస్తేనే పంట పొలాలలకు సాగునీరు సక్రమంగా అందుతుంది. త్వరిత గతిన పనులు పూర్తి చేసి ఖరీఫ్‌ సీజన్‌కు సాగునీరు సక్రమంగా అందేలాచూడాలి

– కె.ఎస్‌.ఆర్‌.దాసు, రైతు జమీదగ్గుమిల్లి

Advertisement
 
Advertisement
Advertisement