చిలకలపూడి(మచిలీపట్నం): కేంద్ర ప్రభుత్వ పథకాలను కృష్ణా జిల్లాలో కచ్చితంగా అమలు చేయాలని మచిలీపట్నం ఎంపీ వల్లభునేని బాలశౌరి అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశం హాలులో శనివారం జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, కాగిత కృష్ణప్రసాద్, వెనిగండ్ల రాము, కలెక్టర్ డి.కె.బాలాజీతో కలిసి కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు పురోగతిని ఎంపీ సమీక్షించారు. ఎంపీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించి స్వయం ఉపాధి పెంపొందించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో శ్మశాన వాటికల నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని తీర ప్రాంతాల్లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. కౌలు రైతులకు పంట రుణాలు ఇచ్చేలా బ్యాంకర్లు ముందుకు రావాలన్నారు.
మునిసిపల్ కమిషనర్‌పై ఎంపీ ఆగ్రహం
ఈ సమావేశంలో పాల్గొన్న మచిలీపట్నం మునిసిపల్ కమిషనర్ బాపిరాజుపై ఎంపీ ఆగ్రహం వ్యక్తంచేశారు. మచిలీపట్నంలోని కొబ్బరితోటలో జనసేన కార్యకర్త ఇంటిని కూల్చివేసిన ఘటనపై బాపిరాజును నిలదీశారు. ‘ఏ అధికారంతో ఇంటిని కూల్చారు? హైకోర్టు లేదా మీ పై ఉన్నతాధికారులు ఆదేశాలు ఏమైనా ఇచ్చారా? ఉంటే చూపండి. అది ప్రభుత్వ, మున్సిపాలిటీకి సంబంధించి భూమి కాదు, ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న తగదా వల్ల ఎటువంటి సంబంధం లేని మీరు ఎందుకు ఆ ఇంటిని కూల్చారు?’ అంటూ ప్రశ్నించినా మునిసిపల్ కమిషనర్ మాత్రం తలదించుకుని మౌనంగా ఉండిపోయారు. ఈ సమావేశంలో డీఆర్వో కె.చంద్రశేఖరరావు, జెడ్పీ సీఈఓ జె.అరుణ, డ్వామా పీడీ ఎన్.వి.శివప్రసాద్, డీఎంహెచ్‌ఓ ఆర్.యుగంధర్, జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి చిన్న నరసింహాలు, ఎల్‌డీఎం రవీంద్రారెడ్డి, పంచాయతీ రాజ్ ఎస్‌ఈ రమణారావు తదితరులు పాల్గొన్నారు.


