రీచ్‌లు మూతపడినా అగని ఇసుక దందా కృష్ణానది, మున్నేరు, వైరా ఉపనదుల్లో అక్రమ తవ్వకాలు ఉచిత ఇసుక పథకం మాటునపచ్చనేతల అక్రమార్జన తెలంగాణకు యథేచ్ఛగా ఇసుక తరలింపు లారీ ఇసుక ధర రూ.80 వేలకు పైనే..
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ నేతల ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. కూటమి అధికారంలోకి వచ్చింది మొదలు పార్ల మెంట్ ముఖ్యనేత, ఆయా నియోజకవర్గాల ప్రజా ప్రతినిధుల అనుచరులు ప్రకృతి వనరులపై కన్నేశారు. నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఇసుక రీచ్‌ల గడువు ముగిసినా ఉచిత ఇసుక పథకం మాటున నదీ గర్భాన్ని గుల్లగుల్లగా తవ్వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గతంలో అనుమతిచ్చిన 12 రీచ్‌లకు గడువు ముగియడంతో అవి మూతబడ్డాయి. అయితే వాటిలోని కాసారబాద, వేములపల్లి రీచ్‌లను తెరిచి ఇసుక తవ్వేస్తున్నారు. లారీ లోడింగ్ రూ.10 వేలు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. పేరుకే ఉచితమని, ఇసుక కావాలంటే డబ్బులు చెల్లించాల్సిందేనని ప్రజలు వాపోతున్నారు. హైదారాబాద్‌కు తరలించే ఇసుకకు టన్నుకు రూ.2 వేలు చొప్పున 40 టన్నులకు రూ.80 వేలు వసూలు చేస్తున్నారు. ఖమ్మం తరలించేందుకు టన్నుకు రూ.1200 చొప్పున దండుకుంటున్నారు. ఇసుక దందా వెనుక అధికార పార్టీ నేతలు ఉండటంతో అధికారులు సైతం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇసుక దందాకు పోలీసులు, మైనింగ్, రెవెన్యూ అధికారులు కొందరు వత్తాసు పలుకుతున్నారు. టీడీపీ నేతలకు డబ్బు ముట్టజెబితే చాలు అధికంగా ఇసుక లోడు చేస్తున్నారు.
తెలంగాణ పక్కనే ఉండటంతో..
జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతోంది. మునేరు నుంచి పగలు ట్రాక్టర్లతో ఇసుక తరలించి డంప్ చేసి, రాత్రి వేళ తెలంగాణకు లారీల్లో తరలిస్తున్నారు. చెక్ పోస్టులను తప్పించి అడ్డదారుల్లో తెలంగాణ తరలిస్తున్నారు. వత్సవాయి మండలం నుంచి ఖమ్మంనకు పెద్ద ఎత్తున ఇసుక తరలిస్తున్నారు. జగ్గయ్యపేట, నందిగామ ప్రాంతం నుంచి లారీకి 50 టన్నులకు పైగా లోడ్ చేస్తూ రూ.లక్షలు దండుకొంటున్నారు. ఇసుక రీచ్‌ల్లో యంత్రాల ద్వారా ట్రాక్టర్ లోడింగ్‌కు అధికార పార్టీ నాయకులు రూ.500 నుంచి రూ.600 అక్రమంగా వసూలు చేస్తున్నారు. ఇటీవల పెనుగంచిప్రోలు పోలీసులు అక్రమంగా హైదరాబాద్‌కు ఇసుక రవాణా చేస్తున్న తెలంగాణాకు చెందిన మూడు లారీలను పట్టుకున్నారు. లారీలకు ఎస్కార్ట్‌గా ముందు ఒక వాహనం ఉన్నట్లు గుర్తించారు. వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల్లో పెనుగంచిప్రోలుతో పాటు కొళ్లికూళ్ల, సుబ్బాయి గూడెం, వెంగనాయకునిపాలెం, గుమ్మడిదుర్రు, శనగపాడు, పోలంపల్లి, ఇందుగుపల్లి, కన్నెవీడు, శింగవరం, ఆళ్లూరుపాడు గ్రామాల నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనిగండ్ల పాడు రీచ్ నుంచి రాత్రి సమయాల్లో ట్రాక్టర్లలో తెలంగాణకు ఇసుక తరలిస్తున్నారు.
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పచ్చనేతలు ఇసుకను ఆర్థిక వనురుగా మార్చుకున్నారు. ఇబ్రహీంపట్నం మండలం ఫెర్రీ వద్ద కృష్ణా నదిలో 20 డ్రెడ్జింగ్ యంత్రాలతోకూడిన పడవలతో నది గర్భంలో ఉన్న ఇసుకను తవ్వి తరలిస్తున్నారు. కృష్ణానదిలో డ్రెడ్జింగ్ యంత్రాలతో ఇసుక తవ్వేందుకు వాల్టా చట్టం కింద అనుమతులు అవసరం. స్థానిక సచివాలయంలో సైతం అనుమతి పొందాలి. అయితే ఎటువంటి అనుమతులూ లేకుండా భారీ యంత్రాలతో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. భారీసైజు పడవల్లో లోడింగ్ చేసి ఒడ్డుకు తరలిస్తున్నారు. ఒడ్డుకు చేరిన పడవల నుంచి సుమారు 18 మ్యావల్ క్రేన్‌లతో ట్రాక్టర్‌లకు లోడింగ్ చేస్తున్నారు. ఫెర్నీ నుంచి రోజుకు సుమారు 500 ట్రాక్టర్ల వరకు ఇసుక రవాణా జరుగుతోంది. ఒక్కొక్క ట్రాక్టర్ ఇసుక లోడింగ్‌కు రూ.800 చొప్పున వసూలు చేస్తున్నారు. పరిసర గ్రామాలతో పాటు గుంటుపల్లి, గొల్లపూడి, భవానీపురం వరకు ఇక్కడి నుంచి ఇసుకు తరలిస్తున్నారు. ఈ లెక్కన రోజుకు సుమారు రూ.4 లక్షల వరకు అక్రమంగా సంపాదించి వెనకేసుకుంటున్నారు. ఈ తవ్వకాల వల్ల నదీ గర్భంలో ఏర్పడిన భారీ గోతుల వల్ల పలువురు ప్రమాదాలబారిన పడుతున్నారు. వాస్తవానికి ప్రభుత్వం అనుమతించిన రేవుల నుంచి మాత్రమే ఇసుక తవ్వకాలు జర పాలి. పచ్చనేతలు ప్రభుత్వ ఆదేశాలను బేఖా తరు చేస్తూ ఇసుక తవ్వి ట్రాక్టర్ల ద్వారా తర లించి సొమ్ము చేసుకుంటున్నారు. ఏడాది క్రితం మైనింగ్ అధికారులు ఫెర్రీ ఇసుక రేవులో ఆకస్మిక దాడులు నిర్వహించి 24 ట్రాక్టర్లు, 18 క్రేన్లు, 10 పడవలను సీజ్ చేశారు. అప్పుడు ఓ నెల రోజులు ఇసుక దందా ఆపినా ఆ తరువాత యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఇబ్రహీంపట్నంతో పాటు దాములూరు, కొటికలపూడి గ్రామాల్లో సైతం కూటమి నాయకులు జేసీబీలతో ఇసుకను తవ్వి ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా తరలించి అమ్ముకుంటున్నారు.


