కార్మికుల మోముపై జలహాసం | - | Sakshi
Sakshi News home page

కార్మికుల మోముపై జలహాసం

May 21 2026 10:01 AM | Updated on May 21 2026 10:01 AM

కార్మికుల క్యాంపుల్లో తాగునీటి కష్టాలను పరిష్కరిస్తున్న అధికారులు లోయ, కడింపోతవరం ఒడిశా కార్మికుల క్యాంపుల్లో తాగునీటి సమస్య కార్మికుల కష్టాలపై ‘నరక కూపాలు’ శీర్షికన కథనం ప్రచురించిన సాక్షి స్పందించి ట్యాంకర్లతో తాగునీరు సరఫరా చేస్తున్న రెండు పంచాయతీలు

జి.కొండూరు: నాలుగు దశాబ్దాలుగా వలస కార్మికుల కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలు చూపే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. 40 ఏళ్ల క్రితం పొట్టకూటి కోసం ఎల్లలు దాటి వచ్చి అటవీ ప్రాంతానికి ఆనుకొని నివసిస్తున్న ఒడిశా కార్మికుల దుర్భర జీవనంపై ఈ నెల 17వ తేదీన ‘నరక కూపాలు’ శీర్షికన సాక్షలో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి అధికార యంత్రాంగం స్పందించింది. తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక అవస్థలు పడుతున్ను కార్మికుల కుటుంబాల గొంతు తడిపే చర్యలు ప్రారంభమయ్యాయి. జి.కొండూరు మండలంలోని గడ్డమణుగు శివారు లోయ, పినపాక శివారు కడింపోతవరం పరిధిలోని అటవీ ప్రాంతంలో 35 ఒడిశా కార్మికుల కుటుంబాలు 40 ఏళ్లుగా మాస్టర్‌ క్యాంపు, 32 కుటుంబాలు గాంధీ క్యాంపుగా ఏర్పడి నివసిస్తున్నాయి. అయితే తమ ప్రాంతాల్లో కనీస మౌలిక వసతులు లేక ఆ కుంటుంబాల వారు నరకయాతన పడుతున్నారు. గుక్కెడు తాగునీరు అందక వారు పడుతున్న ఇబ్బందిని వివరిస్తూ ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనానికి స్పందించిన అధికారులు గడ్డమణుగు పంచాయతీ నుంచి మాస్టర్‌ క్యాంపునకు, పినపాక పంచాయతీ నుంచి గాంధీ క్యాంపునకు రోజుకు ఐదు వేల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకర్లను మంగళవారం రాత్రి నుంచి పంపుతున్నారు. ఈ నీరు క్యాంపుల్లో నివాసం ఉండే కుటుంబాలు తాగేందుకు వినియోగించుకోను న్నారు. ఇకపై తాగునీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు ఒక్కొక్క క్యాంపులో ఒకటి చొప్పున సంపులు నిర్మించి ట్యాంకర్ల ద్వారా తరలించిన నీటిని వాటిలో నింపనున్నారు.

త్వరలో పైపులైను ఏర్పాటు

ఈ రెండు క్యాంపుల్లో ఉన్న రెండు బోర్లలో నీరు కలుషితమై పసుపు రంగులో వస్తోంది. కార్మిక కుటుంబాలు వారు ఇంటి, వ్యక్తిగత అవసరాలకు ఇదే నీటిని వినియోగించి అలర్జీల బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ఈ రెండు క్యాంపులకు 600 మీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ బోరు నుంచి నీటిని సరఫరా చేసేందుకు పైపులైను ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. అతి త్వరలో ఈ పైపులైను కూడా ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో నీటి సమస్యకు పరిష్కారం లభించినట్లేనని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement