విజయవాడ రూరల్: మండలంలోని పాతపాడు గ్రామంలో ఉపాధి పథకం అనుసంధానంతో చేపట్టిన జలధార పనులను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ బుధవారం పరిశీలించారు. పనుల పురోగతి, నాణ్యత, శ్రామికుల హాజరు తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కూలీలతో మాట్లాడి వారికి అందు తున్న వేతనాలు, తాగునీరు, నీడ, ప్రథమ చికిత్స వంటి సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం కూలీలకు సగటు వేతనం రూ.307 అందేలా కృషి చేస్తున్నామని తెలి పారు. నీటి భద్రత లక్ష్యంగా జలధార కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇన్‌చార్జి ఎంపీడీఓ కె.పార్థసారథి, డ్వామా పీడీ రాము పాల్గొన్నారు.
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఆరోగ్యకరమైన సమాజానికి క్రీడలు దోహదం చేస్తాయని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) డైరెక్టర్, అర్జున, ద్రోణాచార్య అవార్డు గ్రహిత రమణరావు పేర్కొన్నారు. నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం ఆవరణలో ఎన్టీఆర్ జిల్లా స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు బుధవారం జరిగాయి. రమణరావు మాట్లాడుతూ.. క్రీడాకారులు క్రమశిక్షణ, పట్టు దలతో సాధన చేస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించొచ్చని సూచించారు. శాప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లీగులు క్రీడాకారులు తమ ప్రతిభను నిరూపించుకోడానికి వేదికలన్నారు. ఎన్టీఆర్ జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ శ్రీలత మాట్లాడుతూ.. పట్టుదలతో ప్రయత్నం చేస్తే సాధ్యం కానిది లేదన్నారు. ఎన్టీఆర్ జిల్లా యువజన సంక్షేమ అధికారి కొల్లేటి రమేష్ మాట్లాడుతూ.. యువత క్రీడలపై దృష్టి పెట్టడం వల్ల ఆరోగ్యం తోపాటుగా ప్రభుత్వ ప్రోత్సాహకాలతో ఉజ్వల భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చని పేర్కొన్నారు. డీఎస్‌డీఓ కె.కోటేశ్వరరావు మాట్లాడుతూ.. జిల్లా స్థాయిలో వెయింట్ లిప్టింగ్ పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎంపిక చేస్తామని, వారు రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్యం కోసం పీహెచ్‌సీలకు వచ్చిన రోగులకు ఆభ ఐడీలు రూపొందించి, వారి వివరాలను వందశాతం ఆన్‌లైన్ చేయాలని ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని ఆదేశించారు. ఆమె బుధవారం జి.కొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు మంచినీటి సౌకర్యం, మందుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో కాన్పుకోసం వచ్చిన మహి ళతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రం వైద్యాధికారితో పాటు, సిబ్బంది పాల్గొన్నారు.
గుడివాడ టౌన్: స్పోర్ట్స్ అథారిటీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(శాప్) కృష్ణాజిల్లా స్థాయి వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారుల ఎంపిక పోటీలు బుధవారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో జరిగాయి. ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన 36 మంది వెయిట్ లిఫ్టర్‌లు వివిధ విభాగాలల్లో పాల్గొన్నారు. మూడు కేటగిరీల్లో జరిగిన ఈ పోటీలలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన నాగసాయి, కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన కె.నిఖిల్ కుమార్, జి. నాగసాయి అజయ్‌వర్మ మొదటి స్థానం సాధించారని నిర్వాహకులు తెలిపారు. విజేతలకు ఎన్టీఆర్ స్టేడియం కమిటి ఉపాద్యక్షుడు యలవర్తి శ్రీనివాసరావు సర్టిఫికెట్‌లు అందజేశారు. కార్యక్రమంలో శాప్ కృష్ణజిల్లా ప్రతినిధి ఝాన్సీలక్ష్మి, వెయిట్ లిఫ్టర్ శిరోమణి, ఎం.త్రినాథ్, కోచ్ మారెళ్ల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.


