దాతృత్వం అపహాస్యం | - | Sakshi
Sakshi News home page

దాతృత్వం అపహాస్యం

May 21 2026 10:01 AM | Updated on May 21 2026 10:01 AM

వేంకటేశ్వర స్వామి అలంకరణకు బంగారు కిరీటం సమర్పించిన దాతలు కల్యాణ మండపం కోసం కిరీటాన్ని తాకట్టుపెట్టిన వైనం గుడివాడలో ఆర్యవైశ్య మందిర నిర్వహణ కమిటీ నిర్వాకం

కిరీటం అలంకరించ లేదు

గుడివాడరూరల్‌: దాతృత్వాన్ని అపహాస్యం చేస్తూ దేవుడి అలంకరణ కోసం భక్తితో దాతలు సమర్పించిన కిరీటాన్ని ఓ ప్రైవేట్‌ ఫైనాన్స్‌ సంస్థ వద్ద తనఖా పెట్టిన ఘటన గుడివాడలో బుధవారం వెలుగుచూసింది. రూ.75 లక్షల విలువైన ఈ కిరీటాన్ని ఆర్యవైశ్య కల్యాణ మండపం నిర్వహణ కమిటీ తనఖా పెట్టింది. గుడివాడ మెయిన్‌ రోడ్డులో ఉన్న ఆర్యవైశ్య కల్యాణ మండపం ఆవరణలో శ్రీకళ్యాణ వెంకటేశ్వరస్వామి దేవస్థానం ఉంది. కల్యాణ మండపం నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో దేవస్థాన కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు నడుస్తాయి. ఈ దేవస్థానానికి నందివాడ మండలానికి చెందిన మాటూరి సుబ్బారావు, లక్ష్మీకుమారి దంపతులు గత ఏడాది జనవరిలో రూ.75 లక్షలు వెచ్చించి 461 గ్రాముల బంగారంతో రాళ్లు పొదిగిన కిరీటాన్ని స్వామికి సమర్పించారు. ఉత్సవాల సమయంలో ఈ కిరీటాన్ని స్వామికి అలంకరించాలని వారు కోరారు. అయితే ఏడాదిగా స్వామివారికి ఈ కిరీటం అలంకరించిన దాఖలాలు లేవు.

కల్యాణ మండపం పూర్తి చేసేందుకు..

ఆర్యవైశ్య కల్యాణ మండపాన్ని ఆధునికీకరించి ఏసీ మండపంగా మార్చాలని నిర్వహణ కమిటీ తీర్మానించింది. దీని కోసం మండపం మిగులు నిధులు, దాతల సహకారంతో పనులు ప్రారంభించింది. అయితే నిధుల కొరతతో నిర్మాణం మధ్యలో నిలిచిపోయింది. కమిటీలోని పెద్దలు, పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు సమావేశం ఏర్పాటు చేసుకుని తలా రూ.2 లక్షలు విరాళం వేసుకుని నిర్మాణం పూర్తి చేయాలని తీర్మానించుకున్నారు. అనుకున్న సమయానికి ఎవరూ సహకరించలేదు. దీంతో కల్యాణ మండపం నిర్వహణ కమిటీ కన్ను బంగారు కిరీటంపై పడింది. కమిటీ సభ్యులందరూ సమావేశమై ఆ కిరీటాన్ని తాకట్టు పెట్టి వచ్చే నగదుతో కల్యాణ మండపాన్ని పూర్తి చేయాలని, ఆ తర్వాత వచ్చే నగదు, దాతల విరాళాలతో కిరీటాన్ని విడిపించాలని నిర్ణయించారని సమాచారం. ఇదే తడువుగా కిరీటాన్ని తాకట్టు పెట్టేందుకు పలుచోట్ల తిరిగారు. దేవుడి కిరీటం కావడంతో ఎవరూ ముందుకు రాలేదు. ఓ ప్రైవేట్‌ ఫైనాన్స్‌ సంస్థలో కమిటీ సభ్యులకు ఉన్న పరపతిని ఉపయోగించి నూటికి రూ.1.75 వడ్డీ చొప్పున రూ.38 లక్షలకు కిరీటాన్ని తాకట్టు పెట్టారు. అయితే ఈ విషయాన్ని దాతలకు తెలపలేదు. కిరీటాన్ని స్వామివారికి అలంకరించాలని దాతలు పలుమార్లు కోరినా ఏదో ఒక సాకు చెప్పి కాలయాపన చేశారు. కిరీటాన్ని తాకట్టుపెట్టారని తెలిసి దాతలు విస్తుపోయారు. కమిటీ నిర్వాకంపై జిల్లా, పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

మేము ఎంతో భక్తిగా 461 గ్రాముల బంగారంతో రాళ్లు పొదిగించి కిరీటం తయారు చేసి స్వామి వారికి సమర్పించాం. కిరీటాన్ని స్వామి వారికి ఎప్పుడూ అలంకరించలేదు. అలంకరించాలని అడిగినా సరైన సమాధానం చెప్పడం లేదు. కిరీటం సమర్పించిన సమయంలో రశీదు కూడా ఇవ్వలేదు.

– మాటూరి సుబ్బారావు దంపతులు, దాతలు

Advertisement
 
Advertisement
Advertisement