రక్షణ కరువైన శిక్షణ | - | Sakshi
Sakshi News home page

రక్షణ కరువైన శిక్షణ

May 21 2026 10:01 AM | Updated on May 21 2026 10:01 AM

నాగాయలంక కృష్ణా తీరంలో 50 మంది బాలలకు జలక్రీడల్లో శిక్షణ శిక్షణ ఇస్తున్న ఇద్దరు స్థానిక జాతీయ క్రీడాకారులు కనీస వసతులు, పరికరాలు సమకూర్చని ప్రభుత్వం

ఏ విధమైన రక్షణ ఆచ్ఛాదన లేకుండా ఘాట్‌లో

రాతి నేలపైనే ఫిట్‌నెస్‌ శిక్షణ పొందుతున్న బాలలు

కృష్ణానదిలో కెనోయింగ్‌, ఈత శిక్షణలో ఉన్న బాలలకు

కొరవడిన రక్షణ కవచాలు

నాగాయలంక: నాగాయలంకలోని కృష్ణానది తీరంలో రాష్ట్రప్రభుత్వ జలక్రీడల శిక్షణ అకాడమీ (వాటర్‌ స్పోర్ట్స్‌ అకాడమీ) ఆధ్వర్యంలో ఈనెల 1వతేదీ నుంచి బాలలతో వేసవి జల క్రీడల శిక్షణ సందడిగా కొనసాగుతోంది. గ్రామానికి చెందిన నాయుడు గాయత్రి, కన్నా కుమార్‌, మరి కొందరు క్రీడాకారులు జాతీయ స్థాయిలో పతకాలు సాధించి ఇక్కడి వాటర్‌ స్పోర్ట్స్‌ అకాడమీకి కీర్తి తెచ్చారు. ఈ ఏడాది సమ్మర్‌ కోచింగ్‌ క్యాంప్‌–2026 ఈనెల 31వరకు కొనసాగుతుందని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌(శాప్‌) అధికారులు చెప్పారు. వాటర్‌ స్పోర్ట్స్‌ అకాడమీ కింద శాప్‌ నేతృత్వంలో ఎంపిక చేసిన 50 మంది బాలలకు గ్రామానికి చెందిన జాతీయ జల క్రీడాకారులు నాగిడి గాయత్రి, కన్నా కుమార్‌ శిక్షణ ఇస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఎవరూ నమోదు చేసుకోకపోవడంతో శిక్షణ కేవలం స్థానిక బాలలకే పరిమితమైంది.

రక్షణ చర్యలు ఏవీ...

వేసవి శిక్షణ అయితే ఇస్తున్నారు కానీ బాలలకు సరైన రక్షణ చర్యలను ప్రభుత్వ అధికారులు సమకూర్చలేదు. లైఫ్‌ జాకెట్లు కనిపించలేదు సరికదా బాలలు ఫిట్‌నెస్‌ వ్యాయామాలు చేసేందుకు క్రీడాశాఖ కనీస మ్యాట్‌లు కుడా ఇవ్వకపోవడంతో చిన్నారులు ఘాట్‌లోని రాతి నేలపైనే వ్యాయామ శిక్షణ పొందాల్సి వస్తోంది. ఉదయం 6 నుంచి గం.8.30 గంటల వరకు, సాయంత్రం 4.30 నుంచి 6.30 గంటల వరకు శిక్షణ ఇస్తున్నారు. నాగాయలంక జలక్రీడల అకాడమీకి నాగాయలంక క్రీడాకారుల ప్రతిభతో జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చినప్పటికీ శాప్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అసలుకే మోసం వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయమై వివరణ కోరగా జిల్లా క్రీడా సంస్థ అధికారి ఝాన్సీ మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో పిల్లలు నమోదు చేసుకోలేక పోతున్నారని అన్నారు. పిల్లలకు చిక్కీలు ఇస్తున్నామని చెప్పారు. చిన్న చిన్న ఆట వస్తువులు సమకూర్చామని, అవి నాగాయలంకకు పంపించాల్సి ఉందని, తనకు ఆరోగ్యం బాగుండక వెళ్లలేక పోయానన్నారు. నిధులు కేటాయించాల్సిన పరిస్థితి ఉందనేది వాస్తవమేనని అంగీకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement