పలు దొంగతనాల కేసుల్లో నిందితులు అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

పలు దొంగతనాల కేసుల్లో నిందితులు అరెస్ట్‌

May 21 2026 10:01 AM | Updated on May 21 2026 10:01 AM

కృష్ణలంక(విజయవాడతూర్పు): పలు దొంగతనం కేసుల్లో నిందితులను అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి సుమారు రూ.10 లక్షల విలువైన 75 గ్రాముల బంగారు ఆభరణాలు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కృష్ణలంక ఎస్‌ఐ ఎస్‌.గిరిధర్‌ బాబు తెలిపారు. బస్టాండ్‌లోని పోలీసు అవుట్‌పోస్ట్‌లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టి కేసుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. విజయనగరం జిల్లా ధర్మపురి బీసీ కాలనీకి చెందిన 25 సంవత్సరాల వయస్సు కలిగిన ఉప్పలాడ రాము చిన్నప్పటి నుంచే చెడు వ్యసనాలకు అలవాటు పడి, జల్సాలకు బానిసగా మారాడు. రోజువారీ కూలి పనులు చేసి సంపాదించే ఆదాయం సరిపోక సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నాడు. ఈ క్రమంలో విజయనగరం ప్రాంతంలో పలు మోటార్‌ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడి వాటిని విక్రయించి వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవాడు. అనంతరం విజయవాడకు వచ్చి ఎన్‌ఆర్‌ఐ హోమ్‌కేర్‌ సర్వీసెస్‌ సంస్థలో ఉద్యోగిగా చేరాడు. నిందితుడు కావాలనే వృద్ధులు మాత్రమే నివసించే ఇంట్లో పని కల్పించాలని సంస్థ నిర్వాహకులను కోరాడు. వారు కూడా ఇతని నేర చరిత్ర గురించి తెలుసుకోకుండా తమ కమిషన్‌ కోసం బృందావన్‌ కాలనీలో నివసిస్తున్న ఫిర్యాదిదారుల ఇంటిలో నెలకు రూ.20వేలు జీతంపై కేర్‌టేకర్‌గా నియమించారు. విధుల్లో చేరిన రెండు రోజులకే సుమారు 32 గ్రాముల బంగారు గొలుసును అపహరించి ఉద్యోగాన్ని మానేశాడు. అనంతరం ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ నెల 13వ తేదీ తెల్లవారుజామున ఉదయం 3 గంటల సమయంలో అతని స్నేహితుడు రామలింగేశ్వరనగర్‌కు చెందిన బోలు మణికంఠ అలియాస్‌ నేరంతో కలిసి ఇంటి వద్దకు చేరుకున్నాడు. రాము ఒక్కడే రహస్యంగా ఫిర్యాదిదారుని ఇంట్లోకి ప్రవేశించాడు. ఇల్లు మొత్తం వెతికినా విలువైన వస్తువులు దొరకలేదు. దీంతో ఆగ్రహానికి గురైన నిందితుడు వంటగదిలో ఉన్న కత్తిని తీసుకొని బెడ్‌రూమ్‌లో నిద్రిస్తున్న ఫిర్యాదిదారుని చంపుతానని భయపెట్టి అతని మెడలో ఉన్న సుమారు 5 తులాల బంగారు గొలుసును అపహరించి అక్కడి నుంచి నేరంతో కలిసి పరారయ్యాడు. బాధితుని ఫిర్యాదుపై వెంటనే అప్రమత్తమై నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించామని ఎస్‌ఐ గిరిధర్‌ తెలిపారు. సీపీ రాజశేఖర బాబు ఆదేశాల మేరకు తమ సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ముమ్మరం చేశామన్నారు. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించి లొకేషన్‌ ఆధారంగా నిందితుడు రాము విశాఖపట్నం వెళుతున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నామన్నారు. విచారణలో అపహరించిన బంగారు గొలుసును మింగినట్లు ఒప్పుకున్నాడు. వెంటనే నిందితునికి వైద్య పరీక్షలు, స్కానింగ్‌ నిర్వహించి వైద్యుల సహాయంతో అతని కడుపులో నుంచి బంగారు గొలుసును బయటకు తీశామన్నారు. దానితో పాటు అదే ఇంటిలో దొంగతనం చేసిన మరో బంగారు గొలుసును కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. అతని వద్ద నుంచి రూ.10లక్షల విలువైన 75 గ్రాముల బంగారు నగలతో పాటు ఒక బజాజ్‌ పల్సర్‌ 220 బైక్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడి గత చరిత్ర, అతనిపై నమోదైన క్రిమినల్‌ కేసుల వివరాలను పరిశీలించకుండా పోలీసు ధ్రువీకరణ చేపట్టకుండానే ఉద్యోగంలో నియమించిన సంస్థ నిర్వాహకులను కూడా కేసులో చేర్చామన్నారు. నిందితునికి సహాయం చేసిన నేరంను కూడా అరెస్ట్‌ చేశామన్నారు. ప్రజలు తమ ఇళ్లలో పని కోసం వ్యక్తులను నియమించుకునే ముందు తప్పనిసరిగా పోలీస్‌ వెరిఫికేషన్‌ చేయించుకోవాలని సూచించారు.

రూ.10 లక్షల విలువైన 75 గ్రాముల బంగారు ఆభరణాలు, బైక్‌ స్వాధీనం

Advertisement
 
Advertisement
Advertisement