పటమట(విజయవాడతూర్పు): మారుతున్న కాలంతో పాటు సైబర్ నేరగాళ్లు సరికొత్త పద్ధతుల్లో బ్యాంకింగ్ మోసాలకు పాల్పడుతున్నారని, వీటిని అరికట్టడానికి బ్యాంక్ సిబ్బంది, పోలీసులు సమన్వయంతో పనిచేయాలని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర బాబు అన్నారు. బుధవారం పోలీస్ కమిషరేట్‌లో బ్యాంకింగ్ మోసాల పై ఐసీఐసీఐ బ్యాంకు ప్రతినిధులతో ఆయన వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్యాంకింగ్ మోసాలు జరిగినప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితులను ఎలా గుర్తించాలి, త్వరితగతిన నిధులను ఎలా ఫ్రీజ్ చేయాలి, కేసుల దర్యాప్తులో పాటించాల్సిన చట్టపరమైన వ్యూహాలపై ఐసీఐసీఐ బ్యాంక్ నిపుణులతో కలిసి చర్చించారు. సేవింగ్స్ ఖాతాల నుంచి కరెంట్ ఖాతాలకు మార్పిడి జరిగే సమయంలో కస్టమర్ల వివరాలను పూర్తిగా పరిశీలించాలని, అనుమానాస్పద లావాదేవీలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. బ్యాంకులు, పోలీసులు కలిసికట్టుగా పనిచేస్తేనే బాధితులకు న్యాయం చేయగలమన్నారు. ప్రజలు కూడా అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే వాట్సాప్ లేదా వీడియో కాల్స్ నమ్మి ’డిజిటల్ అరెస్ట్’ భయానికి లోనుకావద్దని, ఎలాంటి ప్రభుత్వ సంస్థ కూడా డబ్బులు డిమాండ్ చేయదని గ్రహించాలన్నారు. ఎవరైనా బ్యాంకింగ్ లేదా సైబర్ మోసానికి గురైతే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు నమోదు చేయాలని, మోసం జరిగిన మొదటి గంట (గోల్డెన్ అవర్) లో ఫిర్యాదు చేస్తే పోగొట్టుకున్న సొమ్మును తిరిగి రాబట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సైబర్ క్రై మ్ డీసీపీ కె.కృష్ణ ప్రసన్న, డీసీపీలు కృష్ణకాంత్ పటేల్, షిరీన్ బేగం, డాక్టర్ కె.తిరుమలేశ్వర రెడ్డి, కేజీవీ సరిత, ఏబీటీఎస్. ఉదయరాణి, ఏసీపీలు, సీఐలు, ఎస్‌ఐ లతో పాటు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రతినిధులు నీలేష్ దేశ్ పాండే, రజనీష్ ఖన్నా, సందీప్ మెహర, అన్నాజీ తదితరులు పాల్గొన్నారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
ముక్త్యాల(జగ్గయ్యపేట): అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఓ వ్యక్తి మృతదేహాన్ని బుధవారం గ్రామస్తులు గుర్తించారు. వివరాలలోకి వెళితే మండలంలోని కె.అగ్రహారం గ్రామానికి చెందిన దార్ల కృష్ణ (46) తాపీ పనులకు వెళ్లి జీవనం సాగిస్తున్నాడు. రోజూ మాదిరిగానే మంగళవారం కూడా పనికి వెళ్లి రాత్రికి ఇంటికి రాలేదు. బుధవారం ఉదయం గ్రామ సమీపంలోని సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద మృతి చెంది ఉండటాన్ని గమనించిన స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చిల్లకల్లు ఎస్‌ఐ తోట సూర్య శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుని భార్య ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందగా ఇద్దరు పిల్లలతో నివాసముంటున్నాడు.


