రూరల్ మండల ఏపీఎంను సస్పెండ్ చేసిన పీడీ సస్పెన్స్ తొలగింపు విషయంలో కాలయాపనపై నిరసన మానసిక వత్తిడితో చనిపోతున్నట్లు పీడికి లేఖ పంపిన ఏపీఎం తన కుమారుడు కనిపించడం లేదంటూ ఏపీఎం తల్లి ఫిర్యాదు
విజయవాడరూరల్: ఎన్టీఆర్ జిల్లా డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ అనుమల నాగ వెంకట నాంచారావు వేధింపులు తాళలేక తాను చనిపోతున్నట్టు లేఖ రాసి విజయవాడ రూరల్ మండల ఏపీఎం గంధం చంద్రశేఖర్ అదృశ్యమయ్యారు. ఈ విషయం డీఆర్డీఏ వర్గాల్లో సంచలనం కలిగించింది. పీడీకి పంపిన లేఖ లోని సారాంశం ఈ విధంగా ఉంది. గొల్లపూడి క్లస్టర్ ఎంఎస్‌సీసీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గొల్లపూడి బ్రాంచి, కొన్ని ఇతర బ్యాంకులలో కూడా ఫేక్ డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేయడమే గాక రుణాలు ఇప్పించి, అందిన కాడికి డబ్బులు వసూలు చేశారని గత ఏడాది అక్టోబర్ నెల 6వ తేదీన రిపోర్ట్ సబ్మిట్ చేశారు. రిపోర్ట్ అందిన రెండు రోజులకు అనగా 8వ తేదీన డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ చంద్రశేఖర్‌ను సస్పెండ్ చేశారు. తాను ఎటువంటి ఆర్థిక అవకతవకలకు పాల్పడలేదని తనను సస్పెండ్ చేసి 8 నెలలుగా పోస్టింగ్ ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నారని వాపోయారు. తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజాప్రతినిధులకు తెలియచేసి వారితో పీడీకి ఫోను చేయించినా వారం రోజుల్లో పోస్టింగ్ ఇస్తానని చెప్పి ఇవ్వలేదని, తన ఆర్థిక పరిస్థితి, తన కుటుంబ పరిస్థితిని తెలియచేసినా పోస్టింగ్ ఇవ్వలేదన్నారు. దీంతో తాను తీవ్ర మానసిక వేదనకు లోనై చనిపోవాలని నిర్ణయం తీసుకొన్నట్లు ఏపీఎం గంధం చంద్రశేఖర్ ఆ లేఖలో పేర్కొన్నారు.
చంద్రశేఖర్ అదృశ్యంపై భవానీపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): డీఆర్డీఏలో ఔట్ సోర్సింగ్ విధానంలో ఏపీఎంగా పనిచేస్తూ ఇటీవల సస్పెండ్ అయిన వ్యక్తి అదృశ్యమైన ఘటన భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు... జగ్గయ్యపేట మండలం షేర్‌మహమ్మద్‌పేటకు చెందిన గంధం చంద్రశేఖర్ డీఆర్డీఏలో ఔట్‌సోర్సింగ్ విధానంలో ఏపీఎంగా పనిచేస్తున్నాడు. గొల్లపూడి కార్యాలయానికి దగ్గర్లోనే నివాసం ఉంటున్నాడు. 8 నెలల క్రితం ఆఫీసులో జరిగిన అవకతవకల నేపథ్యంలో సస్పెండ్ అయ్యాడు. అప్పటి నుంచి మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ఉంటున్నాడు. తనను తిరిగి విధులలో చేర్చుకోవాలని డీఆర్‌డీఏ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అక్కడి అధికారులు కొంత సమయం వేచి ఉండాలని సూచించారు. దీంతో మనస్తాపానికి గురైన చంద్రశేఖర్ ఇంటి నుంచి డీఆర్‌డీఏ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ నుంచి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి కనిపించకుండా వెళ్లిపోయాడు. చంద్రశేఖర్ తల్లి గంధం అంజమ్మ ఫిర్యాదు మేరకు భవానీపురం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.


