కోడూరు: జిల్లాలో జనగణన కార్యక్రమాన్ని సజావుగా పూర్తి చేసేందుకు అధికారులందరూ సమష్టిగా పని చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కోడూరు తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం జనగణన కార్యక్రమంపై అధికారులతో కలెక్టర్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఎన్యూమరేటర్లు జనగణనకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకుండా తాళం వేసి ఉంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తాళం వేసిన ఇంటికి మరలా ఎన్యూమరేటర్ వెళ్లి వివరాలను తప్పనిసరిగా సేకరించాలని స్పష్టం చేశారు. కేటాయించిన అన్ని గృహస్తుల వివరాలు పూర్తిగా ఆన్‌లైన్ చేస్తేనే కచ్చిమైన డేటా నమోదవుతుందని, గ్రామాల్లో అందుబాటులో లేని వారి వివరాలు కూడా ఫోన్ల ద్వారా సేకరించాలని కలెక్టర్ ఆదేశించారు. సూపర్‌వైజర్లు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి జనగణనపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వివరాల నమోదు జరుగుతున్న తీరును పరిశీలించాలని సూచించారు. కోడూరు మండలంలో 15వేల ఇళ్లకు గాను ఇప్పటికే 13వేల ఇళ్లకు సంబంధించి జనగణన పూర్తి చేసినట్లు తహసీల్దార్ సౌజన్య కిరణ్మయి కలెక్టర్‌కు వివరించారు. అనంతరం జనగణనకు కేటాయించిన సూపర్‌వైజర్లతో మాట్లాడి క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మందపాకల గ్రామంలో తవ్విన ఉప్పునీటి రొయ్యల చెరువు కారణంగా 50 ఎకరాల మాగాణి భూమి చౌడుబారుతోందని, రత్నకోడు డ్రైన్‌లో నుంచి న్యూ ఇరాలి డ్రైన్‌లోకి వేసిన అక్రమ తూములు తొలగించాలని పలువురు రైతులు కలెక్టర్‌కు అర్జీ అందించారు. ఎంపీడీఓ సుధాప్రవీణ్, ఎంఈఓ టి.వి.ఎం.రామదాసు, రీసర్వే డీటీ పద్మప్రియ, సిబ్బంది పాల్గొన్నారు.
హీట్ వేవ్ హెచ్చరికలతో అప్రమత్తం
జిల్లాలో ఈ నెల 24 వరకు అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని కలెక్టర్ డీజే బాలాజీ తెలిపారు. ఏపీఎస్‌డీఎంఏ, ఐఎండీలు జిల్లా హీట్ వేవ్ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శిశువులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు జాగ్రత్త వ్యవహరించాలని, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని స్పష్టం చేశారు. రైతులు కూడా మధ్యాహ్న వేళల్లో పనులు తగ్గించుకోవాలని కలెక్టర్ సూచించారు.
కలెక్టర్ డీకే బాలాజీ


