మూగజీవాల అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు | - | Sakshi
Sakshi News home page

మూగజీవాల అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు

May 21 2026 10:01 AM | Updated on May 21 2026 10:01 AM

కోనేరుసెంటర్‌: జిల్లాలో మూగజీవాల వధ, అక్రమ రవాణాకు సంబంధించి ఎటువంటి సంఘటనలు చోటుచేసుకున్నా సంబంధిత వ్యక్తులపై జిల్లా పోలీసు యంత్రాంగం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు హెచ్చరించారు. ఆయన బుధవారం మాట్లాడుతూ బక్రీద్‌ పండుగ పేరుతో మూగజీవాలను వధించటం చట్టవిరుద్ధమని, అటువంటి చర్యలకు పాల్పడే ఏ ఒక్కరినీ ఉపేక్షించేది లేదన్నారు. మూగజీవాల వధతో పాటు అక్రమరవాణాను అడ్డుకునేందుకు జిల్లాలో ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామన్నారు. జిల్లా అడిషనల్‌ ఎస్పీ వి.వి.నాయుడును నోడల్‌ అధికారిగా నియమించామని, ఆయనతో పాటు పశుసంవర్థకశాఖ, రెవెన్యూశాఖలు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీంలుగా ఏర్పడి పనిచేస్తాయన్నారు. ఈ టీంలు జిల్లావ్యాప్తంగా ఉన్న సరిహద్దు ప్రాంతాలతో పాటు చెక్‌పోస్టులు, గ్రామీణ ప్రాంతాలతో సహా తనిఖీలు నిర్వహిస్తూ ఉంటాయన్నారు. అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేయటంతో పాటు నిరంతరం నిఘా ఉంచుతాయన్నారు. జిల్లాలో ఎవరైనా ప్రభుత్వ నిబంధనలు, కోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించటంతో పాటు జంతుసంరక్షణ చట్టాన్ని పట్టించుకోకుండా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మూగజీవాలను అక్రమంగా తరలిస్తూ పట్టుబడితే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామన్నారు. మూగజీవాల అక్రమ రవాణా గురించి సమాచారం అందిస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు.

జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు హెచ్చరిక

Advertisement
 
Advertisement
Advertisement