పరిసరాల పరిశుభ్రత సామాజిక బాధ్యత | - | Sakshi
Sakshi News home page

పరిసరాల పరిశుభ్రత సామాజిక బాధ్యత

May 17 2026 7:26 AM | Updated on May 17 2026 7:26 AM

అవనిగడ్డ: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్‌ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన అవనిగడ్డలోని పోస్టాఫీస్‌ రోడ్డులో చెత్తను తొలగించి కార్య క్రమాన్ని ప్రారంభించారు. తరచూ చెత్త వేస్తున్న ప్రాంతాలను బ్లాక్‌ స్పాట్‌గా గుర్తించి అక్కడ ఎర్రమట్టితో చదును చేసి సుందరంగా రంగులు వేసి మూడు రోజుల్లో గ్రీన్‌ స్పాట్‌గా మార్చాలని సూచించారు. అనంతరం కలెక్టర్‌ పలు ప్రాంతాల్లో పర్యటించి చెత్త వేసే ప్రాంతాలను పరిశీలించారు. అక్కడ చెత్త వేయకుండా చూడాలని స్థానికులకు సూచించారు. సరుకులు, కూరగాయల కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ గుడ్డ సంచిలను తీసుకెళ్లాలని, ఆహార పదార్ధాల కోసం హోటళ్లు, టిఫిన్స్‌ సెంటర్లకు వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ బాక్సులు తీసుకెళ్లాలని సూచించారు.

డ్రైన్లు సరిగా లేక ఇబ్బందులు పడుతున్నాం

డ్రైనేజీలు సరిగా లేకపోవడం వల్ల మురుగునీరు పోవడం లేదని, దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని కొంతమంది స్థానికులు కలెక్టర్‌కు విన్నవించుకున్నారు. దీనికి స్పందించిన కలెక్టర్‌ వెంటనే డ్రైన్లను బాగుచేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శాశ్వతంగా మురుగునీరు వ్యవస్థకు ఎంత ఖర్చవుతుందో అంచనాలు వేయాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులకు సూచించారు. స్వచ్ఛ రథం ద్వారా పాతపుస్తకాలు, సామగ్రిని తీసుకుని కందిపప్పును అందించారు. చెత్తను ఇచ్చి విలువైన సరుకులు తీసుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. అనంతరం ప్రభుత్వ ఏరియా వైద్యశాల కూడలిలో ప్రజలు, అధికారులతో కలసి మానవహారం నిర్వహించారు. ప్రజలతో స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ప్రత్యేకంగా గుడ్డతో తయారు చేసిన స్వచ్ఛ ఆంధ్ర బ్యానర్లను వినియోగించారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించి ప్లాస్టిక్‌ బేలింగ్‌ యంత్రాన్ని పరిశీలించి పనితీరును తెలుసుకున్నారు. వర్మికంపోస్ట్‌ కేంద్రాన్ని పరిశీలించారు. ఆ ప్రాంతంలో మొక్కలు నాటారు. స్వచ్ఛరథం వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు.

హెల్మెట్‌ ధరించి బైక్‌ ర్యాలీ

అనంతరం హెల్మెట్‌ ఆవశ్యకతను తెలియజేసే కార్యక్రమంలో భాగంగా హెల్మెట్‌ ధరించిన కలెక్టర్‌ బాలాజీ బైక్‌ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్మెట్‌ ధరించకపోతే జరిగే అనర్ధాలను వివరించారు. కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బోలెం నాగమణి, డీపీవో ధనలక్ష్మి, జెడ్పీసీఈవో ఆరుణ, డీఎస్పీ అభిషేక్‌, సీఐ యువకుమార్‌, ఇన్‌చార్జి తహసీల్దార్‌ శ్రీనివాసరావు, ఎంపీపీ తుంగల సుమతీదేవి, ఎల్‌ఐసీ మేనేజర్‌ హరిప్రసాద్‌తో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ డీకే బాలాజీ

Advertisement
 
Advertisement
Advertisement