ఏలూరు రేంజి ఐజీ అశోక్‌కుమార్
పామర్రు: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా పోలీస్ శాఖ నేరాలను నియంత్రించడమే కాకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించగలుగుతోందని ఏలూరు రేంజి ఐజీ జి.అశోక్‌కుమార్ అన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా శనివారం ఆయన పామర్రు పోలీస్ స్టేషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు రోడ్ సేఫ్టీ అధికారులతో పాటు జాతీయ రహదారుల శాఖ అధికారుల సమన్వయంతో తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. రాత్రి సమయాలలో వెహికల్ డ్రైవర్లకు ఉపశమనం కోసం జాతీయరహ దారిలో అక్కడక్కడ వాష్ రూమ్‌లను ఏర్పాటు చేయటం వలన మంచి ఫలితాలు ఉంటాయని అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కూడా ప్రమాదాల నివారణకు దోహద పడుతున్నాయని అన్నారు. కృష్ణా జిల్లాలో జాతీయ రహదారుల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ఎస్పీ బ్లాక్ స్పాటు్‌ల్ గుర్తించి హైవే అధికారులతో వాటి నివారణకు తీసుకున్న చర్యలను ఐజీ వివరించారు. మహిళా రక్షణకు కృష్ణాజిల్లా పోలీస్ శాఖ తీసుకున్న చర్యలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల కితాబు అందించారని అన్నారు. ఇదే విధంగా ఏలూరు రేంజ్‌లోని మిగిలిన జిల్లాలలో కూడా అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. తొలుత స్టేషన్ ఆవరణలో పచ్చదనం పరిశుభ్రతలో భాగంగా ఎస్పీ విద్యా సాగర్ నాయుడుతో కలిసి ఐజీ మొక్కలను నాటారు. అనంతరం సిబ్బంది గౌరవ వందనాన్ని స్వీకరించారు. స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించే ముందు గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వారికి గ్రామాల్లో జరిగే నేరాల నియంత్రణపై పలు సూచనలు, సలహాలను అందించారు. కార్యక్రమంలో గుడివాడ డీఎస్పీ పాల శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ వై.సత్య కిషోర్, పామర్రు సీఐ నాగ ప్రసాద్, ఎంపీడీవో కె.జ్యోతి, ఎస్‌ఐ శ్రీనివాస్, గుడివాడ డివిజన్ పరిధిలోని పలువురు సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.


