మాట్లాడుకుందామని పిలిచి హత్య? | - | Sakshi
Sakshi News home page

మాట్లాడుకుందామని పిలిచి హత్య?

May 17 2026 7:26 AM | Updated on May 17 2026 7:26 AM

వెంచర్‌లో ప్రాణాలు కోల్పోయిన మహిళ వివాహేతర సంబంధాలే కారణమని అనుమానాలు

మధిర/గంపలగూడెంః భర్తకు దూరంగా ఉంటున్న ఓ మహిళకు ఇద్దరితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య మొదలైన వివాదం.. మహిళ హత్యకు దారి తీసినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిర మండలంలో శనివారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు... ఎన్టీఆర్‌ జిల్లా గంపలగూడెం మండలం మేడూరుకు చెందిన గోపిశెట్టి కల్పన(27) – మైలవరం మండలం బొర్రగూడెంకు చెందిన డేరంగుల నాగరాజు 2021లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు జన్మించాక మనస్పర్థలతో వేర్వేరుగా ఉంటున్నారు. ఆపై కల్పన కొంతకాలం తిరువూరులో, ప్రస్తుతం మధిరలోని ఒక ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీలో పనిచేస్తోంది. ఈక్రమంలో వాయిద్యకారుడు విజయభాస్కర్‌తో ఆమెకు పరిచయం ఏర్పడ్డాక, కొన్నాళ్లకు తిరువూరులోని ద్విచక్ర వాహనాల షోరూమ్‌లో పనిచేసే గంపలగూడెం మండలం కనుమూరుకు చెందిన యార్లగడ్డ చెన్నారావుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయమై విజయభాస్కర్‌, చెన్నారావు మధ్య కొంతకాలంగా వివాదం జరుగుతోంది. ప్రస్తుతం మేడూరులోని పుట్టింట్లో ఉంటూ మధిర వచ్చివెళ్లే కల్పనరోజులాగే శనివారంకూడా బయలుదేరింది.

ఇద్దరం కలిసి మాట్లాడుదాం..

కల్పన విషయమై మాట్లాడే పని ఉందని, ఆమె కూడా వస్తున్నందున రావాలని చెన్నారావు.. విజయభాస్కర్‌కు ఫోన్‌ చేసి చెప్పాడు. తొలుత చెన్నారావు, కల్పన ద్విచక్ర వాహనంపై మధిర మండలం కృష్ణాపురం సమీపాన వెంచర్‌లోకి వెళ్లారు. ఆ లొకేషన్‌ను విజయభాస్కర్‌కు షేర్‌ చేయడంతో ఆయన కాసేపయ్యాక బయలుదేరాడు. అయితే, తొలుత వెళ్లిన చెన్నారావు, కల్పన మధ్య జరిగిన వాగ్వాదంతో ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది. ఆపై చెన్నారావు వెళ్లిపోగా, కాసేపటికి లొకేషన్‌ ఆధారంగా చేరుకున్న విజయభాస్కర్‌కు ఇద్దరూ కనిపించకపోవడంతో వెనుదిరిగాడు. కొద్దిసేపయ్యాక కల్పన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మధిర సీఐ మధు, సిబ్బంది చేరుకుని పంచనామా నిర్వహించారు. మృతురాలి భర్త నాగరాజు, ఆమెతో పరిచయం ఉన్న విజయభాస్కర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, హత్య అనంతరం పరారైన చెన్నారావు... కల్పన సోదరుడి సెల్‌ఫోన్‌కు వివిధ అంశాలపై వాట్సప్‌ మెసేజ్‌లు చేసినట్లు తెలిసింది. ఈమేరకు మృతురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని సీఐ వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement