పామర్రు: కూచిపూడి కళాక్షేత్రాన్ని అభివృద్ధి చేసుకోవడం వలన భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. మొవ్వ మండలం కూచిపూడి గ్రామంలోని కళాక్షేత్రం అభివృద్ధి పనులకు బుధవారం స్థానిక ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాతో కలిసి కలెక్టర్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో ఎంతో ప్రాశస్త్యం కల్గిన కూచిపూడి నాట్య కళ అభివృద్ధి పరిచే కార్యక్రమంలో భాగంగా కూచిపూడి కళా క్షేత్రంలోని నర్తకులకు వసతులు కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమాల నిర్వహణ సమయంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి అన్ని రకాల వసతులు కల్పించేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కళాక్షేత్రం నిర్వాహకులు, స్థానికులు పాల్గొన్నారు.
మచిలీపట్నంఅర్బన్: ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ జనరల్, ఒకేషనల్ థియరీ పరీక్షలు ఈ నెల 21 నుంచి జూన్ 4 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి (ఇన్‌చార్జ్) పోతురాజు తెలిపారు. కలెక్టరేట్‌లోని డీఆర్‌వో చాంబర్‌లో బుధవారం ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై సమన్వయ సమావేశం జరిగింది. పదకొండు లైన్ విభాగాల అధికారులతో పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ మాట్లాడుతూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. థియరీ పరీక్షల కోసం జిల్లాలో 38 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫస్ట్ ఇయర్‌కు చెందిన 13,245 మంది, సెకండ్ ఇయర్‌కు చెందిన 6,609 మంది విద్యార్థులు కలిపి మొత్తం 19,854 మంది పరీక్షలకు హాజరుకానున్నట్లు వెల్లడించారు. అన్ని పరీక్షలను సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి/కన్వీనర్ ఎస్.సరళకుమారి, అదనపు ఎస్పీ, పి.ఎస్.జి.ఎన్.లక్ష్మి, డి.సత్యనారాయణ, జి.సందీప్ తదితరులు పాల్గొన్నారు.
మచిలీపట్నంఅర్బన్: స్థానిక వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ప్రాంగణంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) కృష్ణా జిల్లా శాఖ నూతన జనరల్ కౌన్సిల్ సమావేశం కె.శేషగిరి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా గౌరవాధ్యక్షుడిగా నడకుదిటి రామబ్రహ్మం (మచిలీపట్నం), అధ్యక్షుడిగా బి.లంకేశ్వరరావు (ఉయ్యూరు), ఉపాధ్యక్షులుగా కె.శేషగిరి (బంటుమిల్లి), పి.భాను ప్రకాశరావు (ఉయ్యూరు), వి.శివరామకష్ణ (పెడన), జె.రూబెన్ (గూడూరు), జె.శ్రీనివాసరావు (మచిలీపట్నం) ఎన్నికయ్యారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా తాతా రేణుకారావు (పెడన), అదనపు కార్యదర్శిగా కె.శ్రీనివాసరావు (కృత్తివెన్ను), కార్యదర్శులుగా వి.నాగమల్లేశ్వరరావు, సి.సంతోష్ కుమార్, పి.రవిబాబు, డి.జయప్రకాశ్, వి.వెంకటేశ్వరరావు, వి.ఎస్.వి. సుబ్బారావు, కె.శ్రీను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా రాష్ట్ర కార్యదర్శి మేకల సుబ్బారావు వ్యవహరించారు. సమావేశంలో పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించాలని, 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని, సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తీర్మానాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో నెం.57ను రాష్ట్రంలో అమలు చేసి 11 వేల మందికి పాత పెన్షన్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జి.సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి తమ్ము నాగరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి.దస్తగిరి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శుభాకరరావు, ఎన్. రామబ్రహ్మం పాల్గొన్నారు.
జిల్లా అధ్యక్షుడుబి.లంకేశ్వరరావు
జిల్లా ప్రధాన కార్యదర్శి తాతా రేణుకారావు


