వైన్‌షాపు భాగస్వామిపై టీడీపీ నేత దాడి | - | Sakshi
Sakshi News home page

వైన్‌షాపు భాగస్వామిపై టీడీపీ నేత దాడి

May 15 2026 10:50 AM | Updated on May 15 2026 10:50 AM

వైన్‌షాపు భాగస్వామిపై టీడీపీ నేత దాడి

పెడన: తెలుగు తమ్ముళ్ల రౌడీయిజం వెర్రితలలు వేస్తోంది. తమ పార్టీకి చెందిన వారిపైనే... అదీ పోలీసుల సమక్షంలోనే దాడి చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సేకరించిన, బాధితులు తెలిపిన వివరాల మేరకు పెడన నియోజకవర్గం గూడూరులోని పెట్రోల్‌బంకు సమీపంలో రాయల్‌వైన్స్‌ షాపు పామర్రుకు చెందిన వారికి లాటరీలో దక్కింది. నలుగురు భాగస్వాములతో నడుస్తోంది. ఈ నలుగురిలో ఒకరైన చిలంకుర్తి అశోక్‌పై మంగళవారం రాత్రి తెలుగు తమ్ముళ్లు దాడి చేశారు. తొలుత గూడూరు మండలం డీసీ చైర్మన్‌, టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు పోతన స్వామి నాయుడు చేయిచేసుకోగా పక్కనే ఉన్న స్వామినాయుడు అనుచరులు మూకుమ్మడిగా దాడి చేసి అశోక్‌ను పిడిగుద్దులతో, కాళ్లతో తన్నారు. ఈ తంతు అంతా అక్కడే వైన్‌షాపు ముందు ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. పోలీసుల సమక్షంలోనే స్వామినాయుడు, ఆయన అనుచరులు దాడి చేయడం స్పష్టంగా రికార్డు అయింది. గూడూరులో బెల్టు దుకాణానికి తాను సిఫార్లు చేసిన వ్యక్తికి కాకుండా మరో వ్యక్తికి సరుకును పంపించాడని, అంతేకాకుండా నెలవారీ కమిషన్‌ 30 శాతం వాటా కూడా సక్రమగా ఇవ్వడం లేదని కక్ష పెట్టుకున్న స్వామి నాయుడు తన అనుచరులతో వచ్చి దాడి చేశారని బాధితుడు అశోక్‌ ఆరోపిస్తున్నాడు.

మంగళవారం రాత్రి ఏం జరిగిందంటే...

బెల్టు దుకాణానికి సరుకు కావాలని స్వామినాయుడు అనుచరుడు వచ్చి అడగ్గా అప్పు ఇవ్వడం కుదరదని అశోక్‌ చెప్పి పంపించేశాడు. అనంతరం ఆ వ్యక్తి నలుగురితో వచ్చి గొడవకు దిగి బీరుసీసాతో దాడికి యత్నించాడు. అశోక్‌ 100కు కాల్‌ చేయగా గూడూరు పోలీసులు వైన్‌ షాపు వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో వైన్‌షాపు వద్దకు చేరుకున్న స్వామినాయుడు ఏం జరిగిందని అశోక్‌ను ప్రశ్నించగా, మీకు తెలియకుండా జరుగుతుందా అంటూ అశోక్‌ ఎదురు ప్రశ్నించాడు. దాంతో స్వామినాయుడు రెచ్చిపోయి అశోక్‌పై చేయి చేసుకున్నాడు. ఆ వెనువెంటనే స్వామినాయుడు అనుచరులు ఒక్కసారిగా అశోక్‌పై మూకుమ్మడిగా దాడి చేసి కాళ్లతో చేతులతో కుమ్మేశారు. అశోక్‌ బావమరిది సహాయంతో గూడూరు పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో చేరారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా బాధితుడు అశోక్‌ మాట్లాడుతూ తాను కూడా టీడీపీకి చెందిన వాడినేనని, తనపై దాడి చేయడం దారుణమని వాపోయాడు.

కేసు నమోదు చేశాం : సీఐ

రాయల్‌ వైన్స్‌ వద్ద జరిగిన సంఘటనపై బాధితుడు అశోక్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పెడన సీఐ కె.నాగేంద్రప్రసాద్‌ తెలిపారు. గూడూరు ఎస్‌ఐ సెలవులో ఉండటంతో ఇన్‌చార్జి పెడన ఎస్‌ఐ–2 షేక్‌ బషీర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement