ఆక్వా రైతులు కుదేలు | - | Sakshi
Sakshi News home page

ఆక్వా రైతులు కుదేలు

May 15 2026 10:50 AM | Updated on May 15 2026 10:50 AM

ఎకరానికి రూ.4లక్షలు వరకు ఖర్చు పెడుతున్నారు మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు నీటి మూటలే పెంచిన ధరలు తగ్గించకపోతే ఉద్యమబాట పట్టక తప్పదు విలేకరుల సమావేశంలో ఆక్వా రైతులు, వైఎస్సార్‌ సీపీ నాయకులు

పెడన: రొయ్యలు, చేపల మేతలతో పాటు పౌల్ట్రీ ఫాంలకు సంబంధించిన మేతలను ఇష్టానుసారంగా కంపెనీలు ఒకరిని చూసి ఒకరు పెంచేశారని, పెంచిన ధరలను తగ్గించకపోతే వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో ఉద్యమబాట పట్టాల్సి ఉంటుందని పెడన ఆక్వా రైతు, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధికార ప్రతినిధి గరికపాటి వెంకట రామానాయుడు స్పష్టం చేశారు. పెడన వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో రైతు విభాగం నాయకులతో కలిసి బుధవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ అప్సడా ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఇష్టానుసారంగా ధరలను పెంచడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి నియంత్రణ లేకపోవడం వల్లే ఈ ధరలు పెంచారన్నారు. పెంచిన ధరల విషయంలో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ జూమ్‌మీటింగ్‌ ఏర్పాటు చేసి పెంచిన ధరలను నిలుపుదల చేయాలని చెప్పామని అన్నట్లు మీడియాలలో వార్తలు వచ్చాయని, ఆయన ఆదేశాలను ఆయా కంపెనీలు పెడచెవిన పెట్టి పెంచిన ధరలకే రొయ్యల మేతలను విక్రయించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి పెంచిన ధరలను తగ్గించకపోతే ఆక్వా రైతాంగం ఉద్యమబాట పట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. మత్స్యకారుల సామాజిక వర్గానికి చెందిన జిల్లా మంత్రి కూడా స్పందించి తక్షణం పెంచిన ధరల విషయంలో సానుకూలంగా స్పందించి వాటిని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు తిరుమాని శ్రీనివాసరావు మాట్లాడుతూ టన్నుకు రూ.8వేలు నుంచి రూ.10,500 వరకు పెంచడం వల్ల ఆక్వా రైతు మరింత తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఆక్వా రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిని చంద్రబాబునాయుడు సర్కారు తీసుకువస్తోందని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో ఆక్వా రైతు, వైఎస్సార్‌ సీపీ బంటుమిల్లి మండల అధ్యక్షుడు ముత్యాల నాగేశ్వరరావు, బొమ్మిడి నాగార్జున, వైఎస్సార్‌ సీపీ వివిధ విభాగాల నాయకులు లోయ ఆంజనేయులు, పటమట జగన్మోహనరావు, వీణం భాను తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement