టీడీపీ పాలనలో ఆలయాల ధ్వంసం.. పునర్ నిర్మించిన జగన్ నాడు చెత్తబండిలో విగ్రహాలు.. నేడు వైభవంగా పూజలు ఇది జగన్‌కు హిందూ ధర్మంపై ఉన్న గౌరవానికి నిదర్శనం వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): అభివృద్ధి పేరుతో ఆలయాలను ధ్వంసం చేసి చెత్త బండిలో విగ్రహాలను తరలించిన హిందూ ద్రోహులు చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. సీతమ్మవారి పాదాల వద్ద గల శ్రీ దక్షిణ ఆంజనేయ స్వామి వారి దేవస్థానాన్ని సందర్శించిన వెలంపల్లి శ్రీనివాసరావు, ఆ పార్టీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్‌చార్జి మల్లాది విష్ణుతో కలిసి మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గత చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ దక్షిణ ముఖ ఆంజనేయస్వామి దేవాలయం ఇక్కడ దశాబ్దాలుగా వెలిసి ఉందన్నారు. కానీ 2014–2019 మధ్య అధికారంలో ఉన్న నాటి కూటమి ప్రభుత్వం కృష్ణా పుష్కరాల వంకతో ఈ దేవాలయాన్ని అత్యంత దుర్మార్గంగా కూల్చివేసిందన్నారు. కనీ సం శాస్త్రోక్తంగా వైదిక పనులు చేయకుండా, స్వామి వారి విగ్రహాన్ని మునిసిపల్ కార్పొరేషన్ చెత్తబండిలో వేసి తరలించిన తీరు హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచిందన్నారు. అప్పట్లో స్థానిక హిందువులందరం కలిసి అడ్డుకున్నప్పటికీ, పోలీసులతో నిర్బంధించారని, ఈ ఆలయంతో పాటు సీతమ్మ వారి పాదాలు, శనీశ్వర స్వామి, రాహు కేతువుల ఆలయాలను ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
వైఎస్ జగన్ చొరవతోనే..
2019లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితి మారిందన్నారు. చంద్రబాబు హయాంలో కూల్చివేతకు గురైన ఆలయాలన్నింటినీ పునర్నిర్మించాలని జగన్‌మోహన్ రెడ్డి సంకల్పించి, నిర్మాణం పూర్తి చేశారన్నారు. ఆయన చొరవతోనే ఈరోజు ఈ దక్షిణ ముఖ ఆంజనేయస్వామి ఆలయం మళ్లీ నిర్మితమైందన్నారు. నేడు హనుమాన్ జయంతి సందర్భంగా ఇంతమంది భక్తులు ఇక్కడ స్వామి వారిని కొలుచుకుంటున్నారంటే అది కేవలం జగన్‌మోహన్‌రెడ్డి భక్తిశ్రద్ధలు, హిందూ ధర్మంపై ఆయనకున్న గౌరవం వల్లనే సాధ్యమైందన్నారు.


