ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
లబ్బీపేట(విజయవాడతూర్పు): నర్సింగ్ వృత్తి ఎంతో పవిత్రమైనదని, ఫ్లోరెన్స్ నైటింగేల్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ రోగులకు సేవలు అందించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. అంతర్జాతీయ నర్సింగ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడ జీజీహెచ్‌లో ఏర్పాటు చేసిన నైటింగేల్ విగ్రహాన్ని మంగళవారం ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్‌లతో కలిసి కలెక్టర్ లక్ష్మీశ ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఐవీఆర్‌ఎస్ ఫీడ్‌బ్యాక్‌లో 95శాతానికి పైగా సంతృప్తి స్థాయి లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. రోగులు త్వరగా కోలుకోవడంలో నర్సుల సంరక్షణ, మానసిక ధైర్యం ఎంతో ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ఏపీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఎ. విద్యాసాగర్, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు, ఏపీ ఎన్జీవో అసోసియేషన్ కోశాధికారి కె. శివలీల, నర్సింగ్ సూపరింటెండెంట్ విజయలక్ష్మి, ఆర్‌ఎంఓ డాక్టర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
నాలుగు వెంటిలేటర్ల ఏర్పాటు..
జీజీహెచ్ వెంటిలేటర్ల కొరత ఉండటంతో పార్లమెంటు సభ్యుని అభివృద్ధి నిధుల నుంచి ఒక్కొక్కటీ రూ.15 లక్షలు విలువగల నాలుగు వెంటిలేటర్లను అందజేశారు. వాటిని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ప్రారంభించారు. వసుధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్‌వో ప్లాంట్‌ను సైతం ప్రారంభించారు.


