చిలకలపూడి(మచిలీపట్నం): పదో తరగతిలో 2026–27 విద్యా సంవత్సరంలో నూరుశాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేలా ప్రణాళికలు రూపొందించాలని విద్యాశాఖాధికారులను కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. సోమ వారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో విద్యాశాఖాధికారులతో వచ్చే విద్యాసంవత్సరంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లా డుతూ.. విద్యాశాఖాధికారులు సమన్వయంతో ఇప్పటి నుంచే ఒక పద్ధతి ప్రకారం ప్రణాళిక రూపొందించుకుని విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తూ సరైన సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపి, వారిని మెరుగుపరిచేందుకు కృషి చేయాలన్నారు. కచ్చితంగా ఉత్తీర్ణుతలు కారు అనుకునే విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. పరీ క్షల్లో విద్యార్థుల మార్కులను గమనించేందుకు వీలుగా ఒక యాప్‌ను సిద్ధం చేయాలన్నారు. సబ్జెక్టు ఉపాధ్యాయులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా పునఃశ్చరణ తరగతులు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులతో కూడా సమావేశాలు నిర్వహించి ప్రతి విద్యార్థి తప్పనిసరిగా పాఠశాలకు హాజరయ్యేలా పర్యవేక్షించాలన్నారు. నియోజకవర్గాల వారీగా ప్రధానోపాధ్యాయులతో కూడా సమావేశాలు నిర్వహిస్తామన్నారు. పాఠశాలలకు సరిగా హాజరు కాని విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి అవగాహన కలిగించాలన్నారు. ఈ ఏడాది తెలుగులో 340 మంది విద్యార్థులు ఉత్తీర్ణత కాకపోవటం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ఇలా ఎందుకు జరిగిందని ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని ఆరు పాఠశాలల్లో 50 శాతం కంటే తక్కువ మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కావటం సరికాదన్నారు. తప్పులను సరిదిద్దుకుని ఇప్పటి నుంచి నూరుశాతం ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ సమావేశంలో సమగ్రశిక్షా ఏపీసీ కుముదిని సింగ్, డీవైఈఓలు శేఖర్‌సింగ్, రవికుమార్, పలువురు అధికారులు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ


