ఆయుర్వేద హాస్పటల్ నిర్మాణానికి బ్రేక్
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కొండపల్లి ఆర్‌ఎస్ నంబర్ 433 గజపతి చెరువులో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చెరువు స్థలంలో ఇటీవల కాలంలో ఆయుర్వే వైద్యశాల నిర్మాణంకు అధికారులు పూనుకున్నారు. ఆ స్థలం చెరువుది కావడంతో పట్టణానికి చెందిన కొందరు హైకోర్టును ఆశ్రయించారు. విస్తీర్ణంపై హైకోర్టు ఆరా తీయగా 42.33 ఎకరాలకు ప్రస్తుతం 14 ఎకరాలు మాత్రమే మిగిలి ఉందని రెవెన్యూ అఽధికారులు కోర్టుకు తెలిపారు. ఆగ్రహించిన హైకోర్టు సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం చెరువులో ఎటువంటి కట్టడాలు చేయడానికి వెళ్లేదని అది కోర్టు భవనమైనా కూల్చేయాల్సిందే అని గౌరవ న్యాయమూర్తి తెలిపారు. వెంటనే ఆక్రమణలో ఉన్న చెరువు స్థలంపై కౌంటర్ దాఖలు చేయాలని సంబంధిత అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఆస్థలంలో ఎన్టీటీపీఎస్ క్వార్టర్స్‌తో పాటు పట్టణ సచివాలయం, ఈఎస్‌ఐ వైద్యశాల, పలువురు పేదలు నిర్మించున్న గృహాలు, షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి.
హత్య కేసులో రౌడీషీటర్‌కు జీవితకాల కారాగార శిక్ష
పమిడిముక్కల: హత్య కేసులో ముద్దాయి అయిన రౌడీషీటర్‌కు జీవితకాల కారాగార శిక్ష, 500 రూపాయల జరిమానా విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు మెజిస్ట్రేట్ రాజేశ్వరి విధించినట్లు పమిడిముక్కల సీఐ చిట్టిబాబు శుక్రవారం విలేకరులకు తెలిపారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయి... 2024 సంవత్సరం సెప్టెంబర్ నెల 8వ తేదీన గుమ్మడి రమణ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. కృష్ణాజిల్లా పమిడిముక్కలకు చెందిన మహిళ పైడికొండలపాలెంకు చెందిన సుబ్బారావు అనే వ్యక్తిని వివాహం చేసుకొంది. వీరికి కుమారుడు జన్మించాడు. మనస్పర్దలు రావడంతో సుబ్బారావుతో వివాహ జీవితాన్ని వదులుకొని, గుమ్మడి ప్రకాశరావును రెండో వివాహం చేసుకొని జీవనం సాగిస్తోంది. ప్రకాశరావుతో కూడా విబేధాలు రావడంతో అతని నుంచి విడిపోయి కుమారునితో కలిసి జీవిస్తుంది. ప్రకాశరావు మద్యానికి బానిసై అదే గ్రామానికి చెందిన కుంపటి ఆదిశేషు, మేడూరు గ్రామానికి చెందిన చందవోలు రాజశేఖర్‌తో పరిచయాలు పెంచుకొని ముగ్గురూ కలిసి మద్యం తాగుతూ ఉండేవారు. ఈ క్రమంలో 2024 సంవత్సరం సెప్టెంబర్ నెల 7వ తేదీన అర్దరాత్రి 12 గంటల సమయంలో చందవోలు రాజశేఖర్ ప్రకాశరావుతో గొడవపడి నిన్ను ఎలాగైనా చంపేస్తానని బెదిరించి వెళ్లిపోయాడు. 8వ తేదీ తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో ప్రకాశరావు బస్‌షెల్టర్‌లో నిద్రిస్తుండగా చందవోలు రాజశేఖర్ అక్కడకు వచ్చి నాపరాయి ముక్కతో ప్రకాశరావు తలపై పలుమార్లు కొట్టగా అక్కడికక్కడే మృతిచెందాడు. ఆ సమయంలో ప్రకాశరావు పక్కనే బస్‌షెల్టర్‌లో ఉన్న ఆదిశేషు గుమ్మడి రమణకు చెప్పగా ఆయన స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ బి.శ్రీను కేసు నమోదు చేశారు. విచారణాధికారి అయిన పమిడిముక్కల సీఐ వై చిట్టిబాబు నేరస్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. పరారీలో ఉన్న ముద్దాయి చందవోలు రాజశేఖర్‌ను అరెస్ట్ చేసి కోర్గుకు హాజరు పరచగా రిమాండ్‌కు పంపారు. రాజశేఖర్ పది కేసులలో ముద్దాయిగా సీఐ దర్యాప్తును త్వరిగతిన పూర్తిచేసి ఆధారాలతో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. నిందితునిపై నేరం రుజువు కావడంతో జీవితకాల కారాగార శిక్ష, రూ.500 జరిమానా విధించినట్లు తెలిపారు. త్వరితగతిన విచారణ పూర్తి చేసి నిందితునికి తక్కువ సమయంలోనే శిక్షపడేలా కృషి చేసిన డీఎస్పీ, సీఐ చిట్టిబాబు, ఎస్‌ఐ శ్రీను, సిబ్బందిని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు అభినందించారు.


