చల్లపల్లి: కృష్ణానది దిగువ ప్రాంతాల్లోని పంట పొలాలకు ఏర్పడే నీటి సమస్యను బ్యారేజీల నిర్మాణంతోనే అధిగమించగలమని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సింహాద్రి రమేష్‌బాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సమితి సమావేశాలు చల్లపల్లిలోని చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రంలో గురువారం ప్రారంభమయ్యాయి. ఏపీ రైతు సంఘం అధ్యక్షుడు గుజ్జుల ఈశ్వరయ్య అధ్యక్షతన జరిగిన సభలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న సింహాద్రి రమేష్‌బాబు రైతు సమస్యలు, వాటి పరిష్కారాలపై మాట్లాడారు. అవనిగడ్డ నియోజకవర్గం భౌగోళి కంగా కృష్ణానదికి చిట్టచివరన ఉండటంతో భారీ వర్షాలు పడినా, తుపానులు వచ్చినా పంటలు మునిగిపోతాయని, వర్షాలు పడకపోతే పొలాలు ఎండిపోతాయని తెలిపారు. ఏటా రెండు విపత్తుల్లో ఏదో ఒకదానితో రైతులు పంట నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ వద్ద బ్యారేజీల ఫైల్
సాగునీటి సమస్య నుంచి రైతులకు శాశ్వతంగా విముక్తి కల్గించేందుకు, కృష్ణానదిలో వృథాగా సముద్రంలో కలిసిపోతున్న వందల టీఎంసీల నీటిని ఒడిసి పట్టేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రయత్నాలు ప్రారంభించా మని సింహాద్రి రమేష్‌బాబు గుర్తుచేశారు. ప్రకాశం బ్యారేజీ దిగువున కృష్ణానదిపై చోడవరం వద్ద ఒకటి, మోపిదేవి మండలం బొబ్బర్లంక వద్ద మరొక డ్యాము ఏర్పాటు ఆవశ్యకతను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టిలో పెట్టామని పేర్కొన్నారు. తాము కోరిందే తడవుగా అదే రోజు ఇరిగేషన్ అధికారులు, మంత్రులతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చర్చించారని తెలిపారు. చెక్ డ్యాములు కడితే కట్టలు తెగిపోయే ప్రమాదం ఉన్నందున బ్యారేజీలు నిర్మించాలని అధికారులు సూచించారని పేర్కొన్నారు. బ్యారేజీల నిర్మాణం కోసం మట్టి నమూనాల సేకరణ, బొబ్బర్లంక వద్ద బ్యారేజీ నిర్మాణానికి రూ.2200 కోట్ల ఖర్చవుతుందని అంచనాలు రూపొందించారని వివరించారు. ప్రస్తుతం ఆ ఫైల్ ఫైనాన్స్ డిపార్ట్‌మెంటు వద్ద ఉందన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా రైతు నాయకులు పూనుకుని స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా ఆ ఫైల్‌ను కదిలించి బ్యారేజీల నిర్మాణానికి కృషి చేయాలని కోరారు. బ్యారేజీల నిర్మాణం జరిగితే బొబ్బర్లంక వద్ద 5.57 టీఎంసీలు, చోడవరం వద్ద 3.5 టీఎంసీలను నిల్వ చేసుకోవచ్చన్నారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే డెల్టా, దిగువ ప్రాంతాల్లోని పంట పొలాలకు నీటి కొరత ఉండదని వివరించారు.
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో ఏమిలాభం?
పక్కనున్న తెలంగాణలో డబుల్ ఇంజిన్ గవర్న మెంటు లేకపోయినా ఆ రాష్ట్ర ప్రభుత్వం మొక్క జొన్నను మద్దతు ధరకు కొంటోందని, ఏపీలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఎందుకు కొనలేకపోతోందని సింహాద్రి రమేష్‌బాబు ప్రశ్నించారు. మద్దతు ధర, కొనుగోలు ధర మధ్య వ్యత్యాసాన్ని చెల్లించా లని కేంద్రానికి సీఎం చంద్రబాబు 40 రోజుల వ్యవధిలో రెండు సార్లు లేఖ రాశారని, వాటి వల్ల లాభం ఏమిటని నిలదీశారు.
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సమితి సమావేశాల్లో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు


