అన్నదాతల ఆత్మహత్యలు నివారించే చర్యలేవి? | - | Sakshi
Sakshi News home page

అన్నదాతల ఆత్మహత్యలు నివారించే చర్యలేవి?

May 8 2026 1:13 PM | Updated on May 8 2026 1:13 PM

అసెంబ్లీ సాక్షిగా రైతుల ఆత్మహత్యలపై అబద్ధాలు రైతులు కష్టాల్లో ఉంటే సింగపూర్‌లో విహార యాత్రలా? ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జల ఈశ్వరయ్య

చల్లపల్లి: అన్నదాతల ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకుంటామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాలయాపన చేయటం రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్దికి నిదర్శనమని అంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జల ఈశ్వరయ్య విమర్శించారు. ఇప్పటి వరకూ అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 160 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే అసెంబ్లీలో వ్యవసాయాశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అసలు ఆత్మహత్యలే జరగలేదని చెప్పటం దుర్మార్గమన్నారు. రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఏపీ రైతు సంఘం రాష్ట్ర సమితి సమావేశాలను స్థానిక చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రంలో గురువారం ప్రారంభమయ్యాయి. ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.వి.వి.ప్రసాద్‌ అధ్యక్షతన నిర్వహించిన సభలో ఈశ్వరయ్య మాట్లాడుతూ అసలు వ్యవసాయమేలేని సింగపూరులో వ్యవసాయంపై పరిశోధన చేసేందుకు ఆ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు అక్కడికి వెళ్ళటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఓవైపు మొక్కజొన్న రైతులు తమ పంటను మద్దతు ధరకు అమ్ముకోలేక కష్టనష్టాలు ఎదుర్కొంటుంటే ఆశాఖ మంత్రి మాత్రం సింగపూర్‌ వెళ్ళి జల్సాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతుల్ని ఇంకెంత కాలంమోసగిస్తారు..?

1996లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన ప్రాజెక్టులు నేటికీ పూర్తికాకుండా అలాగే ఉన్నాయని ఇంకెంతకాలం రైతులను మోసం చేస్తారని ఈశ్వరయ్య దుయ్యబట్టారు. రాష్ట్రంలో 43 వేల పైచిలుకు చెరువులు ఉన్నాయని వాటి ద్వారా లక్షల ఎకరాలు సాగువుతున్నాయని గుర్తుచేశారు. మొదట ఆ చెరువులను నింపే ప్రయత్నం చేయాలని కోరారు. సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మూడుసార్లు పోటీచేసి గెలిచిన హిందూపురంలో ప్రజలు తాగటానికి కనీసం గుక్కెడు నీళ్ళు కూడా దొరకటంలేదని ఆయన సినిమాల్లో మాత్రం నీరు ఏరులై పారుతుందని ఎద్దేవా చేశారు. మే 15వ తారీఖున ఒక నెల రోజుల ముందుగానే కృష్ణాడెల్టాకు నీరు అందిస్తామని నాయకులు చెప్పారని మే 15కు ఇంకా వారం రోజులు మాత్రమే ఉందని కానీ సాగునీరు వచ్చే జాడ మాత్రం ఎక్కడా కనిపించటంలేదని అన్నారు. కాలువలన్నీ పిచ్చిమొక్కలు, చెత్తాచెదారంతో పూడుకుపోయాయని వారం రోజుల్లో కాలువల్లో ఎప్పుడు పూడికతీత తీస్తారు..? ఎప్పుడు నీళ్ళు వదులుతారని ప్రశ్నించారు. రైతుల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం పోరాటాలు చేయటానికి సమాయత్తం కావాలని ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. ముందుగా రైతు నాయకులు కొమ్మన నాగేశ్వరరావు రైతు సంఘ పతాకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌, మాజీ శాసన సభ్యులు సింహాద్రి రమేష్‌బాబు, విక్కుర్తి శ్రీనివాసరావు, సాగునీటి రంగ నిపుణులు అక్కినేని భవానీప్రసాద్‌, ఏపీ ఆయిల్‌ ఫామ్‌ రైతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొబ్బా వీరరాఘవరావు, కార్యవర్గ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement