కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కొండపల్లిలో అక్రమంగా నిల్వ చేసిన ప్రభుత్వ రేషన్ బియ్యంపై రెవెన్యూ, పోలీస్, పౌరసరఫరాల శాఖ అధికారులు మంగళవారం సంయుక్తంగా దాడి చేశారు. స్థానిక శాంతినగర్‌లోని అభినందన రియల్ ఎస్టేట్ ప్లాట్లులో అక్రమ రేషన్ బియ్యం నిల్వ చేశారనే సమాచారం అందుకున్న పీడీఎస్ డిప్యూటీ తహసీల్దార్ రామకృష్ణ, ఎస్‌ఐ ఎస్‌ఐ చక్రధర్, సిబ్బందితో కలిసి బియ్యం నిల్వ చేసిన ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ నిల్వ ఉన్న పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. వాటిని 550 బస్తాలుగా లెక్క తేల్చారు. అక్కడికి కూతవేటు దూరంలో ఓ రైస్‌మిల్ ఉండటంతో అక్కడ పాలిష్ పట్టి సన్నబియ్యంగా మార్చేందుకు ఇక్కడ నిల్వ చేసినట్లు అనుమానిస్తున్నారు. పేదల వద్ద కేజీల లెక్కన క్వింటా రూ.1000 నుంచి రూ.1200కు కొనుగోలు చేసి పాలిష్ బియ్యాన్ని మార్కెట్‌లో క్వింటా రూ.5 వేల నుంచి 6వేల వరకు విక్రయిస్తారు. అక్రమంగా 550 బస్తాల బియ్యం నిల్వ చేసిన డేరంగుల గోపిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బియ్యాన్ని గోడౌన్‌కు చేర్చారు. డేరంగుల గోపిపై స్థానిక పోలీస్ స్టేషన్‌తో పాటు జేసీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు డీటీ తెలిపారు.


