దుర్గగుడిలో ‘ఆన్‌లైన్’కు బ్రేక్
ప్రసాదాల విక్రయాలకు నో ఆన్‌లైన్ లడ్డూ విక్రయాల్లో భారీ వ్యత్యాసం మొన్న దర్శన టికెట్ల జిరాక్స్‌లు
పరిశీలనలో భాగంగా కొన్ని మార్పులు..
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దేవదాయ శాఖ ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ సేవలకు దుర్గగుడిలో బ్రేక్ పడింది. రాష్ట్రంలోని అన్ని ప్రముఖ ఆలయాల్లో కూటమి ప్రభుత్వం ఆన్‌లైన్ సేవలను ప్రారంభించింది. దుర్గగుడిలో సైతం దర్శన టికెట్లు, ప్రసాదాల విక్రయం, ఆర్జిత సేవలను కూడా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేసింది. దీనికి ఘాట్‌రోడ్డు, కనకదుర్గనగర్, మహామండపాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసింది. భవానీ దీక్షల విరమణ తర్వాత నుంచి కౌంటర్లలో మార్పులు చేశారు. కనకదుర్గనగర్‌లోని ప్రసాదాల విక్రయ కేంద్రంలో 5 కౌంటర్లలోని నాలుగు ఆన్‌లైన్ కౌంటర్లు, ఒకటి నగదుతో ప్రసాదాల కొనుగోలుకు అవకాశం కల్పిస్తూ ఏర్పాట్లు చేసింది. పూర్తిగా ఆన్‌లైన్ చేయడంతో భక్తులతో పాటు కౌంటర్లలో ఉన్న దేవస్థాన సిబ్బందికి ఇబ్బందులు తప్పలేదు.
భారీ వ్యత్యాసం గుర్తించి రద్దు
కౌంటర్లకు ఇచ్చే లడ్డూలకు, స్టాక్ బుక్ ఎంట్రీకి, విక్రయాల మధ్య భారీ వ్యత్యాసం వస్తున్నట్లు ఆలయ అధికారులు గుర్తించి, ఆన్‌లైన్ విక్రయాలను రద్దు చేశారు. రెండు నెలల కాలంలో సుమారు 50 వేల పైగా లడ్డూల వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. ఈ వ్యవహారంపై ఆలయ అధికారులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నాలుగు రోజులుగా కనకదుర్గ నగర్‌లోని ప్రసాద విక్రయ కేంద్రంలోని 5 కౌంటర్లలో నాలుగింటిలో నగదుతోనే ప్రసాదాలను కొనుగోలు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తూ, అదనపు సిబ్బందిని నియమించారు. మరో కౌంటర్‌లో కియోస్క్ మిషన్ ఏర్పాటు చేసి అమ్మవారి రూ. 100, రూ. 300 దర్శన టికెట్లు విక్రయించేలా ఏర్పాట్లు చేశారు.
కియోస్క్ మిషన్ల ద్వారా దర్శన టికెట్లు
దుర్గగుడిలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ విధానంపై తొలి నుంచి భక్తులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. రెండు వారాల క్రితం దుర్గమ్మ దర్శనం కోసం ఆన్‌లైన్‌లో బుక్ చేసిన టికెట్లను జిరాక్స్‌లు తీసి తిరిగి విక్రయించిన ఘటన వెలుగు చూసింది. దీంతో ఆన్‌లైన్ టికెట్ల విక్రయాలను రద్దు చేసి ఆలయ ప్రాంగణంలోని పలు ప్రాంతాల్లో కియోస్క్ మిషన్లు ఏర్పాటు చేసి దర్శన టికెట్లను విక్రయిస్తోంది. ఈ మిషన్ల ద్వారా కొనుగోలు చేసిన టికెట్లు సొమ్ము నేరుగా దేవస్థాన ఖాతాలో జమ కావడం మరో విశేషం. తాజాగా ప్రసాదం టికెట్ల విక్రయాల్లో లోపాలు గుర్తించిన దేవస్థాన అధికారులు ప్రసాదాలను ఆన్‌లైన్‌లో కాకుండా నేరుగా కౌంటర్లలో నగదుతో కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేశారు.
ప్రసాదాలు కొనుగోలు చేసే వారిలో ఎక్కువ మంది నగదు చెల్లిస్తామంటున్నారు. కౌంటర్లలో రద్దీ నేపథ్యంలో ఆన్‌లైన్‌కు, నగదుకు వేర్వేరు కౌంటర్లు ఉన్నాయి. ఆన్‌లైన్ విధానం పూర్తిగా అమలు చేసే క్రమంలో పరిశీలన, మార్పులు జరుగుతూ ఉంటాయి. సేవలను పూర్తిగా ఆన్‌లైన్‌లో పొందేలా చూస్తున్నాం.
–శీనానాయక్, ఈవో, దుర్గగుడి
దుర్గగుడిలో ‘ఆన్‌లైన్’కు బ్రేక్


