వేర్వేరు చోట్ల చికిత్స పొందుతూ ఇద్దరి మృతి
జి.కొండూరు: రోడ్డు ప్రమాదంలో గాయపడిన బీటెక్ విద్యార్థి చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండల పరిధి మునగపాడుకు చెందిన బత్తుల గిరీష్ (20) మైలవరంలోని లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం విద్యార్థి. ఈ నెల 12వ తేదీన కళాశాల నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో తన గ్రామానికి చెందిన గంజి స్వామి బైకుపై లిఫ్ట్ తీసుకొని వెళ్తున్నాడు. జి.కొండూరు శివారులోని మలుపు వద్దకు వెళ్లగానే ఎదురుగా వస్తున్న ప్రయివేటు పాఠశాల బస్సు బైకును ఢీకొట్టింది. ఘటనలో బైక్ నడుపుతున్న స్వామికి స్వల్ప గాయాలవ్వగా గిరీష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స నిమిత్తం విజయవాడలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక అతను సోమవారం రాత్రి 10 గంటల సమయంలో మరణించాడు. మృతుడి తండ్రి బాలస్వామి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సతీష్‌కుమార్ పేర్కొన్నారు.
మరో ఘటనలో..
చల్లపల్లి: తాపీ పనిచేస్తూ ప్రమాదవశాత్తు కిందపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందాడు. చల్లపల్లి నారాయణరావునగర్‌కు చెందిన అవనిగడ్డ వెంకట శేషగిరిరావు(59) ఈ నెల 13న పనికివెళ్లి స్లాబుకు ప్లాస్టింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. తలకు బలమైన గాయమై కోమాలోకి వెళ్లాడు. వెంటనే అతన్ని చల్లపల్లిలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించడంతో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 16 తేదీన మృతి చెందాడు. మంగళవారం ఉదయం విజయవాడ నుంచి వచ్చిన సమాచారం మేరకు హెడ్‌కానిస్టేబుల్ ఎ.పాండురంగారావు శవపంచనామా చేసి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. శేషగిరిరావుకు భార్య, కుమారుడు ఉన్నారు.


