రోబోలతో కలసి పనిచేయడానికి సిద్ధమవ్వండి
గుంటూరు మెడికల్: రానున్న కాలమంతా రోబోటిక్, ఏఐ టెక్నాలజీదేనని వాటితో కలసి పనిచేయాల్సిన అవసరం ఉందని సీనియర్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, సాయి భాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి తెలిపారు. స్థానిక గుంటూరు మెడికల్ కళాశాల మెడ్ ఫ్యూజన్‌లో ఏర్పాటుచేసిన సాయి భాస్కర్ హాస్పిటల్స్ స్టాల్ ను మంగళవారం విద్యార్థులు సందర్శించారు. స్టాల్‌లో ఏర్పాటు చేసిన టీవీ స్క్రీన్ మీద మాకో స్మార్ట్ రోబోటిక్ ద్వారా జరుగుతున్న మోకీలు మార్పిడి శస్త్ర చికిత్సలను ఆసక్తిగా గమనించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో డాక్టర్ నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం వైద్యరంగంలో రోబోటిక్, ఏఐ టెక్నాలజీ తమ ప్రాముఖ్యతను పెంచుకుంటూ వస్తున్నాయన్నారు. ఫ్యూచర్లో మన జీవితంలో భాగమవుతాయని వాటి నిర్వహణకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు పెంపొందించుకోవాలని సూచించారు. రోబోటిక్ ద్వారా జరిగే ఆపరేషన్లు కచ్చితత్వంతో కూడుకొని మంచి ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. అంతకుముందు రోబో, ఏఐ టెక్నాలజీతో రూపొందించిన ప్రశ్నావళిని విద్యార్థులతో పూర్తి చేయించి వారికి కలిగిన సందేహాలను నివృత్తి చేశారు.


