పోలీసుల పచ్చపాతం!
అరాచకవాదులను ప్రోత్సహించేలా వ్యవహారశైలి పరామర్శ కోసం వచ్చిన వైఎస్సార్ సీపీ నాయకులను మాత్రం అడ్డగింత పలువురిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించిన వైనం పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు
జోగి రమేష్ ఇంటిపై దాడి సమయంలో చూస్తూ నిలబడిన పోలీసులు
జోగి రమేష్ ఇంటిపై దాడి నేపథ్యంలో సోమవారం క్లూస్ టీమ్ సభ్యులు ఇంటిలో ధ్వంసమైన వస్తువులు, గోడలు, గేట్లు, అద్దాలు పరిశీలించారు. దుండగులు విసరిన పెట్రోల్ బాంబు ఆనవాళ్లు పరిశీలించి ఆ ప్రాంతంలోని పేరుకుపోయిన మట్టిని సేకరించారు. ఇంటి కారిడార్‌లోకి చేరిన రాళ్లు, కర్రలు, తదితర వస్తువులు సేకరించారు. ఫొటోలు వీడియోలు తీసుకున్నారు. ఆ సమ యంలో ఎవరినీ ఇంట్లోకి అనుమతించలేదు.
ఇబ్రహీంపట్నం: వైఎస్సార్ సీపీ మైలవరం నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై ఆదివారం జరిగిన దాడి సమయంలో ప్రేక్షకపాత్ర పోషించి, పచ్చ మూకలను ప్రోత్సహించేలా వ్యవహరించిన పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. వందల సంఖ్యలో జనాలు గుమిగూడుతున్నా.. చేతుల్లో కర్రలు, కత్తులతో బరితెగిస్తున్నా.. నిర్లక్ష్యంగా వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు సంఘటన విషయం తెలుసుకొని, జోగి రమేష్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పేందుకు వెళ్తున్న వైఎస్సార్ సీపీ నాయకులను అడ్డుకోవడం, అదుపులోకి తీసుకోవడాన్ని చూసిన సామాన్యులు ఇదెక్కడి ‘పచ్చ’పాతం అంటూ విస్తుపోతున్నారు.
ప్రొఫెషనల్ కిల్లర్లు మాత్రమే..
ఆదివారం జోగి ఇంటిపై జరిగిన దాడిలో పోలీసులు వహించిన నిర్లక్ష్యం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. వందల మంది అరాచక శక్తులు ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్‌కు చేరుతుంటే అడ్డుకోలేక పోయారు. వారి నిర్లక్ష్యంతో జోగి రమేష్ ఇంటిపై స్థానిక టీడీపీ నాయకులతో పాటు కొందరు అరాచక శక్తులు, ప్రొఫెషనల్ కిల్లర్‌లు పోలీసుల సమక్షంలో దాడి చేశారు. ఈ ఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ దాడి చేసేందుకు ప్రొఫెషనల్ కిల్లర్లు పాల్గొన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రొఫెషనల్ కిల్లర్లు మాత్రమే పెట్రోల్ బాంబు విసరగలుగుతారని చెబుతున్నారు. అటువంటి పెట్రోల్ బాంబులు గుంపులో ఉండి భవనంపైకి విసిరిన వీడియో బయటకు వచ్చి సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేసింది. ఇంటిపై దాడితో పాటు అడ్డొచ్చిన వారిని ఏమి చేయడానికై నా సిద్ధపడిన ప్రొఫెషనల్ కిల్లర్‌లను టీడీపీ నాయకులు రంగంలోకి దింపారు. రింగ్ సెంటర్‌లో వందల మంది వేచి ఉన్నప్పుడు పోలీసులు వారికి రక్షణగా ఉన్నారు. జోగి రమేష్ పోలీస్ ఉన్నతాధికారులకు దీనిపై సమాచారం ఇచ్చినా.. ఎవరూ స్పందించకపోవడంతో పోలీస్ వారి పాత్రపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.
ఎక్కడికక్కడ నియంత్రణ..
జోగి రమేష్ ఇంటిపై దాడి జరగడం, ఆ సమయంలో ఆయన లేకపోవడంతో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, నందిగామ నియోజకవర్గం సమన్వయకర్త మొండితోక జగన్‌మోహనరావు పరామర్శకు వస్తుంటే పశ్చిమ ఇబ్రహీంపట్నం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అక్కడకు చేరిన పార్టీ కార్యకర్తలతో కొద్దిసేపు వివాదం జరిగింది. దేవినేని అవినాష్, మొండితోక జగన్‌మోహనరావును బలవంతంగా కారులోంచి కిందకు దించారు. కూటమి ప్రభుత్వంలో పరామర్శలకు వెళ్లనివ్వరా అని ప్రశ్నించిన అవినాష్‌ను బలవంతంగా చేతులతో ఎత్తి పోలీస్ వాహనంలో ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. మరోవైపు జోగి ఇంటిపై దాడిచేసిన వారిని కొంతమందిని సాయంత్రం అదుపులోకి తీసుకుని నామమాత్రపు కేసులు నమోదు చేశారు. ప్రొఫెషనల్ కిల్లర్లు పెట్రోల్ బాంబులతో చేసిన దాడుల వీడియోలను వైఎస్సార్ సీపీ నాయకులు పోలీసులకు చూపించారు. వీరిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జోగి రమేష్‌పై మరో అక్రమ కేసు నమోదు
జోగి రమేష్‌పై ఇబ్రహీంపట్నం పోలీసులు మరో అక్రమ కేసు ఆదివారం రాత్రి నమోదు చేశారు. జనవరి 31న స్థానిక దాసాంజనేయస్వామి ఆలయంలో తిరుమల వేంకటేశ్వరస్వామి లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ ఇచ్చిన నివేదికపై చంద్రబాబు ప్రభుత్వ పెద్దలకు బుద్ధిని ప్రసాదించాలని పూజలు నిర్వహించారు. ఆ సమయంలో లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే నెపంతో జోగి రమేష్‌పై క్రైమ్ నంబర్ 64/2026, యూ/ఎస్ 196,535,ఆర్/డబ్ల్యూ, 3(5) బీఎన్‌ఎస్,(153ఏ, 505, ఆర్/డబ్ల్యూ, 34 ఐపీసీ) సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీనితో పాటు జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడుపై క్రైమ్ నంబర్ 66/26 యూఎస్, 189(2)190, 292 324(4) బీఎన్‌ఎస్ (143 149,290, 427 ఐపీసీ) సెక్షన్‌ల కింద 40మందిపై కేసులు నమోదు చేశారు. వారిలో 20మందికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. అరెస్ట్ చూపిన వారికి పోలీస్ స్టేషన్‌లో పోలీసులు రాచ మర్యాదలు చేయడం గమనార్హం.
ఇబ్రహీంపట్నం పరిసరాల్లో సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం నుంచి పోలీసులు జోగి రమేష్ ఇంటి వద్ద సుమారు 25మంది వరకూ పహారా కాయడం, ఇబ్రహీంపట్నం రింగ్‌సెంటర్‌లో పోలీస్ వాహనాలు నిలిపి ఉంచడం, స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటు భవానీపురం పోలీసులు కూడా ఇక్కడకు రావడంతో జోగి రమేష్‌ను అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు వినిపించాయి.
పోలీసుల పచ్చపాతం!
పోలీసుల పచ్చపాతం!


