మేరీమాత ఉత్సవాలకు పక్కా ఏర్పాట్లు
గుణదల(విజయవాడ తూర్పు): గుణదల మేరీమాత మహోత్సవాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు విజయవాడ కథోలిక పీఠం బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు అన్నారు. ఏలూరు రోడ్డులో గల సోషల్ సర్వీస్ సెంటర్‌లో సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 9, 10, 11 తేదీలలో మూడు రోజుల పాటు గుణదల లూర్ధుమాత మహోత్సవాలు ఘనంగా జరుగనున్నాయన్నారు. ఈ ఉత్సవాలకు ఆంధ్ర ప్రదేశ్‌తో పాటు తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి లక్షలాది మంది యాత్రికులు తరలివస్తారని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఉత్సవ ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభించామన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఈ ఏడాది ఉత్సవాలను సమర్థంగా జరుపుతామని చెప్పారు.
పోస్టర్ ఆవిష్కరణ..
తిరునాళ్లలో సమష్టి దివ్యబలి పూజలతో పాటు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యాత్రికులు మరియమాతను దర్శించుకొని దీవెనలు పొందాలని ఆకాంక్షించారు. అనంతరం మేరీమాత ఉత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మోన్సిగ్నోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ ఏలేటి విలియం జయరాజు, సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ సునీల్ రాజు పాల్గొన్నారు.
సమస్యలు అధిగమించాలి
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో అనుమతులు పొందిన పరిశ్రమలు నెలకొల్పేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేలా చొరవ చూపాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో పరిశ్రమలు నెలకొల్పేందుకు నియమించిన ప్రత్యేకాధికారులతో ఆయన సమీక్ష జరిపారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 237 పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇచ్చినప్పటికీ వాటికి కొన్ని ఇబ్బందులు, సమస్యలు ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రత్యేకాధికారులు చర్యలు చేపట్టాలన్నారు. మూడు పర్యాయాలు సమావేశాలు నిర్వహించినప్పటికీ వీటిపై శ్రద్ధ చూపకపోవటం, సరైన పురోగతి లేకపోవటం ఏమిటని కలెక్టర్ అధికారులను ప్రశ్నించారు. సమస్యలు పరిష్కరించాక కూడా యూనిట్లు ప్రారంభించకపోతే వారికి తప్పనిసరిగా నోటీసులు జారీ చేయాలన్నారు. జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ వెంకట్రావు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ బాబ్జి, ప్రత్యేకాధికారులు ఉన్నారు.
కుష్ఠు వ్యాధిపై చైతన్యం పెంచాలి
మచిలీపట్నం అర్బన్: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల్లో కుష్ఠు వ్యాధిపై సంపూర్ణ అవగాహన కల్పించాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కుష్ఠు వ్యాధి నిర్మూలన లక్ష్యంగా సోమవారం స్పర్శ్ అవగాహన కరపత్రాలు, గోడపత్రికలను ఆయన ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా స్పర్శ్ అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలన్నారు. శుభ్రత, పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పిస్తే కుష్ఠు వ్యాధిని నియంత్రించి, పూర్తిగా నిర్మూలించడం సాధ్యమవుతుందన్నారు. ఇందుకు సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని, ప్రతి ఒక్కరూ భాగస్వాములై కుష్ఠు వ్యాధి నివారణ, నిర్మూలనకు కృషి చేయాలని సూచించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ పి. యుగంధర్ మాట్లాడుతూ కుష్టు వ్యాధి బారిన పడినవారిపై వివక్షను అంతం చేసి, వారి గౌరవాన్ని కాపాడటం అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ నిర్మూలనాధికారి అంబటి వెంకటరావు పాల్గొన్నారు.
పరీక్షల షెడ్యూల్ విడుదల
మచిలీపట్నంఅర్బన్: టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు (టీటీసీ) పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసినట్లు కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. షెడ్యూల్ ప్రకారం డ్రాయింగ్ లోయర్, హయ్యర్ గ్రేడ్ పరీక్షలు ఫిబ్రవరి 18 నుంచి 21 వరకు ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. హ్యాండ్లూమ్ వీవింగ్ లోయర్, హయ్యర్ గ్రేడ్ థియరీ పరీక్షలు ఫిబ్రవరి 18న నిర్వహించగా, ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 19 నుంచి 28 వరకు పది రోజుల పాటు కొనసాగనున్నట్లు తెలిపారు. అలాగే టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ లోయర్, హయ్యర్ గ్రేడ్ పరీక్షలు ఫిబ్రవరి 18, 19 తేదీల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షల్లో డ్రాఫ్టింగ్, గార్మెంట్ మేకింగ్, కట్టింగ్, ఎంబ్రాయిడరీ అంశాలపై పరీక్షలు జరుగుతాయని వివరించారు. మరిన్ని వివరాలకు www.bse.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
మేరీమాత ఉత్సవాలకు పక్కా ఏర్పాట్లు


