డీజే.. కిల్లర్ హారన్.. టెర్రర్!
వారం రోజుల కిందట లబ్బీపేటలోని ఓ హోటల్ ముందుకు రాత్రి 11 గంటల సమయంలో డీజే పెట్టి అధిక బేస్‌తో శబ్దాలు పెట్టారు. దీంతో ఆ పక్కనే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న ఓ మహిళకు గుండె దడ ప్రారంభమైంది. దీంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాళ్లు వచ్చి డీజేని నిలిపివేయించారు.
పటమటకు చెందిన రాజేష్ ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. ఎదురుగా వాహనాలు నిలవడంతో వాటి వెనుక బైక్‌ను నిలిపాడు. వెనుక నుంచి వచ్చిన ఓ బస్సు డ్రైవర్ ఎయిర్ హారన్ కొట్టారు. అంతే ఒక్కసారిగా రాజేష్ చెవులు గింగురుమన్నాయి. గంట పాటు సరిగ్గా ఏమీ వినలేకపోయాడు. అంతేకాక తీవ్రమైన చెవి పోటుతో ఇబ్బంది పడి, ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చింది.
రోజురోజుకూ శృతి మించుతుండటంతో ఇబ్బందులు
అధిక శబ్దాలతో గుండె దడ, వినికిడి లోపాలు
ఇయర్ ఫోన్లలో ఎక్కువ సౌండ్‌తోనూ సమస్యలే
పూర్తిగా చెముడు వచ్చే అవకాశం ఉంటుందంటున్న వైద్యులు
అప్రమత్తంగా ఉండక తప్పదని హెచ్చరిక
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇటీవల అనేక మంది అధిక శబ్దాలతో ఇబ్బంది పడుతున్నారు. ఎయిర్ హారన్లు, డీజే సౌండ్లతోపాటు, ఇయర్ ఫోన్లను ఎక్కువ సౌండ్‌తో వాడకం వల్ల కూడా అనేక సమస్యలు వస్తున్నాయి. యువకులు సైతం ఈ తరహా సమస్యలతో ఆస్పత్రులకు అధికంగా వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
89–90 డెసిబుల్స్ వరకూ ఓకే..
ఆరోగ్యవంతమైన సౌండ్ 80 డెసిబుల్స్ మాత్రమేనని వైద్యులు చెబుతున్నారు. అయితే 85–90 డెసిబుల్స్ వరకూ ఫర్వాలేదంటున్నారు. కానీ అంతకు మించి శబ్దాలు ఎక్కువ సమయం వింటే ఇబ్బందులు తప్పవని వైద్యులు చెబుతున్నారు. అయితే మన రోడ్లపై భారీ వాహనాలు వేసే ఎయిర్ హారన్ల శబ్దాలు 100 డెసిబుల్స్ వరకూ ఉంటుండగా, డీజే సౌండ్స్ ఇంకా 120 నుంచి 130 డెసిబుల్స్ వరకూ, టపాసులు 120 డెసిబుల్స్ వరకూ ఉంటున్నట్లు వివరిస్తున్నారు. దీంతో అనేక మంది ఇబ్బందులు పాలవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
విజయవాడలో నిషేధం ఉన్నా..
వాహనాలకు ఎయిర్‌హారన్ల వినియోగంపై నగరంలో నిషేధం ఉంది. శబ్ద కాలుష్య నివారణలో భాగంగా వాటిని నిషేధించారు. కానీ సక్రమంగా అమలు కావడం లేదు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులకు సైతం ఎయిర్‌హారన్లు వాడుతున్నారు. ఇటీవల ఆర్టీఏ అధికారులు ప్రైవేటు బస్సులను చేసిన తనిఖీలో ఎయిర్‌హారన్లు ఉన్న వాటిపై కేసులు నమోదు చేశారు. ఎన్ని కేసులు నమోదు చేసినా వాటి వినియోగిస్తూనే ఉన్నారు. దీంతో నిత్యం రోడ్డుపై ప్రయాణించే వారిలో ఎక్కువగా వినికిడి లోపాలు తలెత్తుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
డీజేలతోనూ ఇబ్బందే..
ప్రస్తుతం డీజే ఫ్యాషన్‌గా మారింది. ప్రతి ఈవెంట్‌కు డీజే పెడుతున్నారు. దీంతో అధిక శబ్దాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇండోర్ ఈవెంట్ అయినా, అవుట్‌డోర్ ఈవెంట్ అయినా డీజే వాడకం పెరిగింది. దీంతో ఈవెంట్‌కు హాజరైన వారితో పాటు, ఈ చుట్టు పక్కల ఉన్న వారికి సైతం ఇబ్బందిగా మారుతుంది. డీజే శబ్ద కాలుష్యంపై ఇప్పటి వరకూ అధికారులు సైతం దృష్టి సారించలేదు.
శబ్దకాలుష్యం కారణంగా వినికిడి లోపాలతో మా వద్దకు వస్తున్న వారు ఇటీవల కాలంలో పెరిగారు. ముఖ్యంగా చెవిలో గుయ్‌మంటూ శబ్దాలు రావడం, కర్ణ భేరిలో రంధ్రం పడుతున్న వారు వస్తున్నారు. అంతేకాకుండా 20, 21ఏళ్ల వారు కూడా అధిక శబ్దాల కారణంగా పూర్తిగా వినికిడి లోపం ఏర్పడిన వారిని చూస్తున్నాం. శబ్దాలకు ఎక్కువగా ఫోకస్ కాకుండా చూసుకోవాలి. బయటకు వెళ్లినప్పుడు చెవిలో దూది పెట్టుకోవడం మంచిది. శబ్దాలు వస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో ఎక్కువ సేపు ఉండకుండా జాగ్రత్త పడాలి.
– డాక్టర్ పవన్ కుమార్, ఈఎన్‌టీ సర్జన్, విజయవాడ
అధిక శబ్దాలు వినడం వల్ల చెవిలో గుయ్ మంటూ శబ్దాలు వస్తాయి. చెవి కర్ణభేరికి రంధ్ర పడి విపరీతమైన నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పూర్తిగా వినికిడి కోల్పోవడం లేదా హై ఫ్రీక్వెన్సీ లాసెస్ సంభవిస్తుందంటున్నారు. హై ఫ్రీక్వెన్సీ లాసెస్ కారణంగా మాట వినపడుతుంది కానీ, ఎదుటి వారు ఏమి చెబుతున్నారో అర్థం చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం ఇలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు ఎక్కువగా ఉంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
డీజే.. కిల్లర్ హారన్.. టెర్రర్!


