అవగాహనతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): సైబర్ నేరాలపై అవగాహన పెంచుకున్నప్పుడే వాటికి దూరంగా ఉండగలమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ప్రస్తుత సాంకేతిక యుగంలో టెక్నాలజీ మన జీవితాలను సులభతరం చేస్తున్నప్పటికీ, అదే సమయంలో సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేబీఎన్ కళాశాల కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ విభాగం, నక్ష్ ఫౌండేషన్(ప్రాజెక్ట్ సైబర్ షీల్డ్ ఇనీషియేటివ్) సంయుక్త ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై నిర్వహించిన అవగాహన వర్క్‌షాప్‌లో కలెక్టర్ లక్ష్మీశ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో మనం చేసే చిన్న పొరపాటు సైతం సైబర్ నేరగాళ్లకు అవకాశం కల్పించి, మన కష్టార్జితాన్ని కోల్పోయే పరిస్థితికి దారితీయవచ్చని హెచ్చరించారు. ప్రత్యేకంగా ఆన్‌లైన్ బ్యాంకింగ్, యూపీఐ లావాదేవీలు, ఈ–కామర్స్ కొనుగోళ్లు, సోషల్ మీడియా వినియోగం విషయంలో అప్రమత్తత చాలా అవసరమన్నారు. ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు, బ్యాంక్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోకూడదని స్పష్టం చేశారు. డీసీపీ కృష్ణప్రసన్న మాట్లాడుతూ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, సైబర్ భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కేబీఎన్ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణవేణి, కార్యదర్శి టి.శ్రీనివాస్, ఏఓ వి.నారాయణరావు, నక్ష్ ఫౌండేషన్ ఫౌండర్ రిషబ్ సింగ్, కో ఫౌండర్ రాషి భాటియా, ప్రాజెక్ట్ సైబర్ షీల్డ్ సౌత్ జోనల్ కోఆర్డినేటర్ యశశ్విని, విద్యార్థులు హాజరయ్యారు.


