గుడ్లవల్లేరులో ఖోఖో పోటీలు ప్రారంభం
గుడ్లవల్లేరు: శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో జేఎన్టీయూ కాకినాడ పురుషులు, మహిళల విభాగాల అంతర్ కళాశాలల ఖోఖో టోర్నమెంట్ ప్రారంభమైంది. శనివారం జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి గుడివాడ డీఎస్పీ వి.ధీరజ్ వినీల్ ముఖ్య అతిథిగా, కృష్ణాజిల్లా ఖోఖో అసోసియేషన్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు గౌరవ అతిథిగా విచ్చేశారు. డీఎస్పీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా, యలవర్తి శ్రీనివాసరావు విశ్వ విద్యాలయ పతాకాన్ని ఎగురవేసి జాతి ఐక్యతను, ఔన్నత్యాన్ని చాటారు. ఖోఖో టోర్నమెంట్ నిర్వహణా కార్యదర్శి, కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ఎం.శివశంకర్ క్రీడాకారులకు ఆహ్వానం పలికారు. టోర్నమెంట్‌కు తూర్పు గోదావరి జిల్లా నుంచి ప్రకాశం జిల్లా వరకు వివిధ ఇంజినీరింగ్ కళాశాలల నుంచి 360 మంది పురుష, 270 మంది మహిళా క్రీడాకారులు తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించనున్నారని తెలిపారు.
ఖోఖోకు ప్రత్యేక స్థానం..
ముఖ్య అతిథి ధీరజ్ వినీల్ ప్రసంగిస్తూ క్రీడలలో ఖోఖోకు భారత దేశంలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఓటమికి క్రుంగి పోకుండా వైఫల్యాలకు గల కారణాలు విశ్లేషణ చేయాలన్నారు. గెలుపు బాటలో పయనించే ప్రయత్నం చేయాలని క్రీడాకారులను ఉత్సాహపరిచారు. కృష్ణాజిల్లా ఖోఖో అసోసియేషన్ చైర్మన్ యలవర్తి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని కలిగించడంలో ఎస్‌ఆర్‌జీఈసీ ముందు వరుసలో ఉందని కొనియాడారు. విశ్వ విద్యాలయ పరిశీలకునిగా జెఎన్టీయూ కాకినాడ స్పోర్ట్స్ సెక్రటరి డాక్టర్ శ్యాం కుమార్ విచ్చేశారు. కార్యక్రమంలో కళాశాల కో సెక్రటరీ, కరస్పాండెంట్ వల్లూరుపల్లి రామకృష్ణ, ప్రిన్సిపాల్ డాక్టర్ బుర్రా కరుణ కుమార్, డైరెక్టర్ పి.సిద్ధయ్య, యాజమాన్య సలహాదారు డాక్టర్ పి.రవీంద్రబాబు, ఫిజికల్ డైరెక్టర్ ఎం.శివ శంకర్, వివిధ విభాధిపతులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, మ్యాచ్ రిఫరీలు పాల్గొన్నారు.


