మంచి చేస్తారా? మళ్లిస్తారా?
పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం..
● పంచాయతీలకు ఆర్థిక
సంఘం నిధులు విడుదల
● ఎన్టీఆర్ జిల్లాకు రూ. 18.93కోట్లు
● ఫిబ్రవరితో సర్పంచ్‌ల పదవీకాలం
ముగియనుండటంతో వినియోగంపై ఆందోళన
జగ్గయ్యపేట: గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్య, తాగునీటితో పాటు గ్రామాభివృద్ధికి 2025–26కు సంబంధించి ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేసింది. అయితే ఈ నిధులు సక్రమంగా ఖర్చవుతాయా లేదా అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరో మూడు నెలల్లో పంచాయతీ సర్పంచ్‌ల పదవీకాలం ముగుస్తుండటంతో ఈ నిధులు ఏ మేరకు గ్రామాభివృద్ధికి ఖర్చు చేస్తారో వేచి చూడాల్సి ఉంది. వేసవి కాలం కూడా రానుండటంతో తాగునీటి కొరత నెలకొంటుందని మరి నిధులు వెచ్చిస్తారో లేదోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిధులు మంజూరు ఇలా..
ఎన్టీఆర్ జిల్లాలోని 16 మండలాలకు రూ. 18.93 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులను మంజూరు చేసింది. ఈ నిధులు గ్రామాలలో పారిశుద్ధ్య, తాగునీటికి ప్రాధాన్యతనివ్వటంతో పాటు గ్రామాభివృద్ధి, ఇతర అవసరాలకు వినియోగించుకోవాల్సి ఉంది. ఈ నిధులు ఇప్పటికే ఆయా గ్రామ పంచాయతీల ఖాతాల్లోకి జమయ్యాయి. అయితే పంచాయతీ కమినషర్ నుంచి పూర్తి స్థాయిలో ఆదేశాలు రాలేదని సమాచారం.
గ్రామాలలో అధ్వానంగా పారిశుద్ధ్యం..
ఒక పక్క ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో పారిశుద్ధ్య మెరుగుదలకు చర్యలు తీసుకుంటూ హంగామా చేస్తున్నప్పటికీ గ్రామాలలో మాత్రం పారిశుద్ధ్యం అధ్వానంగానే కనిపిస్తోంది. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు సైతం దారుణంగా ఉన్నాయని గ్రామస్తులు అంటున్నారు. పన్నులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు వస్తున్నా గ్రామాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. అంతే కాకుండా నిధులు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు నెలకొన్నాయి.
ముగుస్తున్న పదవీకాలం..
సర్పంచ్‌ల పదవీ కాలం ముగుస్తుండటంతో కార్యదర్శులు, సర్పంచ్‌లు కుమ్మకై ్క బిల్లులు పెట్టి నిధులను పక్కదారి పట్టేందుకు యత్నిస్తున్నారనే విమర్శలు నెలకొన్నాయి. జిల్లా అధికారుల పర్యవేక్షణ కూడా కొరవటంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా మారుతుందని ఆయా గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు నిధులను సద్వినియోగం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆర్థిక సంఘం నిధులను తాగునీరు, పారిశుద్ధ్య చర్యలకు వినియోగించాలి. నిధులను ఇష్టానుసారం వినియోగించటానికి లేదు. కార్యదర్శులు అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవు.
– రాఘవన్, డీఎల్‌పీవో


